భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ మొబైల్ ఫోన్‌ను ఘరానా మోసగాళ్లు హ్యాక్ చేసి రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలంటూ కాంగ్రెస పార్టీకి చెందిన నలుగురు నాయకులకు ఫోన్ చేశారు. వారిలో గుజరాత్‌కు చెందిన ఇద్దరిని వలవేసి పట్టుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.
కమల్‌నాథ్ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసిన మోసగాళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సిల్కార్వార్, పార్టీ కోశాధికారి అశోక్ సింగ్, ఇండోర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్జీత్ సింగ్ చద్ధా, మాజీ కోశాధికారి గోవింద్ గోయల్‌కు అదే ఫోన్ నుంచి కాల్ చేసి రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని కోరినట్లు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన మీడియా సెల్ చైర్మన్ కెకె మిశ్రా తెలిపారు. అయితే..ఈ కాల్‌ను క్రాస్ చెకింగ్ చేసుకున్న గోయల్ కమల్‌నాథ్ ఎవరినీ డబ్బు అడగలేదని నిర్ధారించుకున్నారు. మోసగాళ్లను ట్రాప్ చేయడానికి ఆయనే స్వయంగా వారికి ఫోన్ చేసి డబ్బు కోసం మాలవీయ నగర్‌లోని తన కార్యాలయానికి రావాలని వారిని పిలిచారు. ముందుగానే పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేయడంతో 25, 28 సంవత్సరాల వయసున్న ఇద్దరు వ్యక్తులు డబ్బు తీసుకోవడానికి ఆఫీసుకు వచ్చిన వెంటనే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నామని, యితే తమకు ఎవరి నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. కాగా..త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు అందచేస్తామని మిశ్రా తెలిపారు.