- అటవీ ప్రాంతంలో ఎక్కువగా పండ్ల మొక్కలు నాటాలి
- సిఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
తూప్రాన్: ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకాల నిర్వహణ చాలా బాగుంది. అయితే ఈ వర్షాకాలంలో మరిన్ని మొక్కలను నాటడంపైన దృష్టి పెట్టాలని, అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. తూప్రాన్ మండలంలోని దాతర్‌పల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో గురువారం ఆమె మెదక్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి పర్యటించారు. మొదట దాతర్‌పల్లిలోని పదెకరాల్లో ఏర్పాటుచేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రియాంక పరిశీలించారు. అక్కడ నాటిన వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం బాగుందని మెచ్చుకున్నారు.మహిళ వాచర్‌ను అభినందించారు. అటవీ భూముల్లో వనాల పెంపకాలపై ఆమె సెక్షన్ ఆఫీసర్ ఓంప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. వివరాలను అందాజగా చెప్పడంతో పక్కా వివరాలు చెప్పాలి. ఊరికే నోటికి వచ్చింది చెప్పొద్దని ఆయనకు సుతిమెత్తగా మందలించారు.
ఇక్కడ హరితహారం కార్యక్రమం బాగున్నందుకు గ్రామ సర్పంచ్ నర్సమ్మను ప్రియాంక అభినందించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏం సమస్యలున్నాయి. తాగునీటి సరఫరా ఎట్లుందని అడుగగా మంచి నీటి తిప్పలు లేవని సర్పంచ్‌తో పాటు అక్కడున్న మహిళా ఉపాధి కూలీలు చెప్పారు. డబుల్‌బెడ్ రూం ఇండ్లు లేవని చెప్పగా నాకు కూడా ఇల్లు లేదని ఆమె చమత్కరించారు.అంగన్‌వాడీసెంటర్‌కు పక్కా భవనం కావాలని అడిగారు. పోతిన్‌పల్లి రోడ్డు నిర్మాణంపనులు ఫారెస్ట్ అధికారుల అడ్డంకుల వల్ల మద్యలోనే ఆగిపోయిందని, వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్ సీనియర్‌నాయకుడు పిట్ల సాయిబాబా ప్రియాంక వర్గీస్‌ను కోరారు. క్లియరెన్స్ అయిందని,త్వరలోనే పనులు మొదలవుతాయని కలెక్టర్ బదులిచ్చారు. అక్కడి నుంచి గుండ్రెడ్డిపల్లికి వెళ్లి ప్రకృతి వనాన్ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. మొక్కల పెంపకం బాగుందని సర్పంచి శ్రీలత రాజిరెడ్డిని అభినందించారు.
అక్కడినుంచి మల్కాపూర్‌కు వెళ్లి పల్లె ప్రకృతి వనాన్ని, విలేజీ నర్సరీని పరిశీలించారు. ప్రకృతివనంలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా తనకు బుద్దుడంటే చాలా ఇష్టమని ప్రియాంక చెప్పారు. చెట్ట పెంపకాలపై శ్రద్ధ చూపుతున్నవాచర్‌నుఆమె శాలువ కప్పి సన్మానించారు. హైస్కూల్‌లో టెన్త్ టాపర్లుగా నిలిచిన నలుగురు బాలికలకుజనరల్ నాలెడ్జ్ పుస్తకాలను అందజేశారు. వారిని మీ లక్షం ఏమిటని అడిగారు. బాగా చదువుకొని మాలాగ, మీ పేరెంట్స్ గర్వపడేవిధంగా ఉన్న ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రియాంక సూచించారు. గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి అక్కడ చెత్తతో ఎరువు తయారు చేసే విధానం,దాని ద్వారా పంచాయతీకి వస్తున్న ఆదాయం గురించి సర్పంచి మహాదేవి నవీన్‌ను, ఉప సర్పంచ్ అంజనేయులుగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు.
షెడ్డు నిర్వహణ, పచ్చనిచెట్లు చూసి ప్రియాంక అబ్బుర పడ్డారు. ఈ పరిసరాలను చూస్తుంటే మా కేరళ గుర్తుకోస్తున్నదన్నారు. గ్రామ శివారులోని అటవీ భూమిలో నాటిన మొక్కల పెంపకాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్త పరిచారు. అక్కడి మొక్కలు, పరిసరాలను పోటో తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ శ్రీనివాస్, డిఎఫ్‌ఓ రవిప్రసాద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్‌రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ ఓం ప్రకాశ్, జిల్లా ప్లాంటేషన్ ఆఫీసర్, స్థానిక మండల స్థాయి అధికారులు, దాతర్‌పల్లి సర్పంచ్ నర్సమ్మ, గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ శ్రీలతరాజిరెడ్డి, ఉప సర్పంచ్ క్రిష్ణ, మల్కాపూర్ సర్పంచ్ మన్నే మహాదేవినవీన్, ఉపసర్పంచ్ అంజనేయులుగౌడ్, ఎంపిటిసి వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.