Friday, December 20, 2024

తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలు…

- Advertisement -
- Advertisement -
ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా చేసుకోని దుస్థితి
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను ప్రకటించిన సందర్భంగా ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స విమర్శలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తూనే ఉన్నామని అన్నారు. విజయవాడలో గురువారం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను బొత్స ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా విధానంపై ఆయన మాట్లాడుతూ ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలను కూడా సక్రమంగా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని విమర్శించారు. మన విద్యా విధానం మనదని, మన ఆలోచనలు మనవని చెప్పారు. వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పొద్దున్నే పవన్ గురించి మాట్లాడుకోవడం ఎందుకని అన్నారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందనే విషయాన్ని తొలుత పవన్ తెలుసుకోవాలని సూచించారు. వక్రబుద్దితో వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఏపి విద్యాశాఖ మంత్రి బొత్సపై తెలంగాణ మంత్రులు విమర్శల దాడి: 
తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోత్సపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నువ్వా మాకు చెప్పేదంటూ కౌంటర్ ఇస్తున్నారు.

బొత్స సత్యనారాయణ, ముందు నువ్వు తెలుసుకో.. నీ దగ్గర ఉన్న గురుకులాలు ఎన్ని మా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది అని మంత్రి గంగుల కమలాకర్ నిప్పులుచెరిగారు. తెలంగాణపై ఇంకా కుట్రలేనా అంటూ విరుచుకుపడ్డారు. తాము ఏపీ జోలికి వెళ్లలేదని.. మాట్లాడుతున్నందుకు తాము ఏం చేశామనేది చెప్పుకోవాల్సి వస్తోందన్నారు……

మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ఉందని ఎద్దేవా చేశారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బొత్స ఎవరు? వోక్స్‌వ్యాగన్ కార్లను చూస్తే గుర్తొచ్చేది ఆయనే కదా. ఉమ్మడి ఏపీలో ఆయన ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీలో అంతులేని అవినీతికి పాల్పడ్డారని విరుచుకపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News