గోదావరిఖని: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, గురువారం స్థానిక రాంమందిర్ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాల్లో చీకటి అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయాల్లో విద్యుత్ లేక, సాగు నీరు లేక పంట పొలాలన్ని బీడు భూములుగా మారి, రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. వ్యవసాయం దండుగ అని నారా చంద్రబాబు నాయుడు ఆనాడు రైతులపై కాల్పులు జరిపించారని, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి రైతులపై కక్షగట్టి, వారి జీవితాలను మళ్లీ చీకటి మయం చేయడానికి కాంగ్రెస్‌తో జట్టుకట్టి రైతు వ్యతిరేక విధానాలకు పూసుకున్నారని ఆరోపించారు.
దేశంలో మరేతర రాష్ట్రంలో లేని విధంగారైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతన్నకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, ఉరివేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, బాలరాజ్‌కుమార్, ఇంజపురి పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, కల్వచర్ల క్రిష్ణవేణి, పాముకుంట్ల భాస్కర్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, పిఎస్ అమరేందర్, పిల్లి రమేష్, మెతుకు దేవరాజ్, అచ్చ వేణు, చల్ల రవీందర్ రెడ్డి, బొడ్డు రవీందర్, తానిపర్తి గోపాల్ రావు, అదర్ సండే సమ్మారావు, కాల్వ శ్రీనివాస్, నూతి తిరుపతి, వడ్డెపల్లి శంకర్‌తోపాటు తదితరులున్నారు.