మన తెలంగాణ/హైదరాబాద్:సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో విభిన్నమైన ఆలోచనలతో పా లన కొనసాగించాల్సిన అవసరమున్నదని బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. దశాబ్ధాల స్వాతంత్య్రానంతరం కూడా అవే మూస ధోరణులను కేంద్ర పాలకులు అవలంబిస్తున్నారని తెలిపారు. అపారమైన సహజ వనరులను వినియోగించుకోవడం ఎటూ చేతగాని దేశ పాలకులకు హిళలు, రైతులు, యువత, వృత్తి కులా లు వంటి సంపద సృష్టించే అపూర్వమైన మా నవ వనరులను కూడా సరైన పంథాలో వినియోగించుకోలేక పోతున్నారని స్పష్టం చేశారు. ఈ దిశగా దార్శనికత లేకపోవడం కారణంగా దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లే దని అధినేత సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చే శారు. పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో పరివర్తన చెందిన భారత దేశాన్ని తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటయిన ‘ భారత్ పరివర్తన్ మిషన్ ’ అని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
మహారాష్ట్ర నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖుల చేరికలు గురువారం బిఆర్‌ఎస్ పార్టీలోకి కొనసాగాయి. ముంబయి సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అధినేత సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీరు బొగ్గు సహా దేశంలో అవసరాలకు మించి నిల్వ వున్న సహజ సంపద, ప్రకృతి వనరుల గురించి వివరించారు. ఏడు దశాబ్ధాలు దాటుతున్నా వాటిని సరైన రీతిలో వినియోగించుకోవడం చేతగాక ప్రజల కష్టాలకు కన్నీల్లకు కారణమౌతున్నారని కేంద్ర పాలకులను సిఎం కెసిఆర్ దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా ఇటువంటి అభివృద్ధి నిరోధకులకే వోట్లేసుకుంటూ వారిని కాకుంటే వీరిని వీరిని కాకుంటే వారిని ఇంకెన్నాల్లు గెలిపించుకుంటూ పోదామని ప్రశ్నించారు. కులమతాలకతీతంగా సమస్త ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీని నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన చైతన్యం ప్రజల్లో మరింతగా రావాల్సి ఉన్నదన్నారు. ఆ దిశగా ప్రతి వొక్క బిఆర్‌ఎస్ కార్యకర్త పనిచేయాల్సిన అవసరమున్నదన్నారు.
దేశ పాలకుల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు.
నల్లజాతీయుల పట్ల తర తరాలుగా వివక్ష చూపిన అమెరికా దేశం, బరాక్ ఓబామా వంటి నల్లజాతీయున్ని దేశాధ్యక్షున్ని చేసి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నదని వివరించారు. అభ్యుదయభావాలతో భిన్నమైన ఆలోచనా ధోరణులున్నప్పుడే దేశంలో సామాజిక సమానత్వం సాధ్యమౌతుందని సిఎం స్పష్టం చేశారు. పురుషునికి సమాన సంఖ్యలో వున్న మహిళా శక్తిని కేవలం వంటింటికి పరిమితం చేస్తూ, ఉత్పాదక రంగంలో, సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేయక పోవడం వలన దేశం నష్టపోతున్నదని పునరుద్ఘాటించారు. మహిళలు, యువత సహా పలు రకాల మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. వారి వారి సామర్థ్యాలను గుర్తించి ఉత్పాదక, అనుత్పాదక రంగాల్లో వారికి అవకాశాలు కల్పించాలే తప్ప కేవలం వారి కులాన్ని బట్టో వర్గాన్ని బట్టో కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వివక్షతకు స్వస్తి పలకాలని, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ దిశగా సమూల మార్పు జరగాల్సిందేనని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మకంగా దేశాభివృద్ధి సాధ్యమౌతుందని స్పష్టం చేశారు.
కాగా.బిఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్రలో రోజు రోజుకూ వృద్ధి చెందుతున్నదనే అంశం పై మహారాష్ట్ర నేతలు సిఎం కెసిఆర్‌తో చర్చించారు. ఇటీవలి పండరిపూర్ పర్యటన తర్వాత మహారాష్ట్రలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు స్పందించడం చూస్తుంటే వారికి బిఆర్‌ఎస్ ఎదుగుదలను చూసి భయం పట్టుకున్నదని అర్థమౌతోందన్నారు. ‘ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా బిఆర్‌ఎస్ గురించిన చర్చనే నడుస్తున్నదనీ, రైతులతో పాటు, వృత్తికులాలు, పేదలు అన్ని వర్గాలు పార్టీని విపరీతంగా ఆదరిస్తున్నారు. పల్లె పల్లెనా బిఆర్‌ఎస్ సభ్యత్వాలు జోరుగా సాగుతున్నాయని వారు అధినేతకు వివరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు సరైన రీతిలో సంపూర్ణమైన రాజకీయ పార్టీ లేదు. అన్నీ సగం సగం చీలిన పార్టీలే వున్నాయి. రేపో మాపో కాంగ్రెస్ కూడా చీలి పోయే పరిస్థితి వున్నది. మహారాష్ట్ర ప్రజలను అక్కడి అన్ని పార్టీలు పిచ్చోల్లను చేస్తున్నాయి.’ అని వారు ఆవేదన చెందారు. ఇటువంటి రాజకీయ సంక్షోభ సమయంలో, తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశ ప్రజలముందుంచిన బిఆర్‌ఎస్ పార్టీని మహారాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని వారు మరోసారి తెలిపారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ఏకోన్ముఖంగా ముందుకుపోతామని వారు ఉత్సాహంగా తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిలో మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్‌ఎ ఎల్. టి. సావంత్, దక్షిణ ముంబయి ఎన్‌సిపి అధ్యక్షుడు మానవ్ వెంకటేశ్, సిబిఐలో పనిచేసి రిటైరయిన రాజ్ సనప్, నిలేశ్ మధుకర్ రాణే వంటి ప్రపంచ ఛాంపియన్ క్రీడాకారుడు, జెడ్పీ మెంబర్ భగవాన్ సనప్, నాగ్ పూర్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ సామాజిక సేవకుడు డా.కిరణ్ వైద్య, ఉత్తమ్ రావు వాగ్, మహారాష్ట్ర ఎంబీటీ అధ్యక్షుడు అజర్ అహ్మద్, ఎంఎల్‌ఎగా పోటీ చేసిన ఘనశ్యామ్ బాపూ హక్కే, పహిల్వాన్ అప్పాసాహెబ్ అరేన, ఎంపిగా పోటీ చేసిన సంతోష్ బిచుక్లే, ప్రకాశ్ సాహురావు బోసాలె, మహారాష్ట్రకు చెందిన పలువురు ఆర్మీ అధికారులు సహా ముంబయి నుంచి వర్షి, బాంద్రా,ధారావి, వంటి ప్రాంతాల నుంచి పలు పార్టీలకు చెందిన సీనియర్లు,
యువ నేతలు, పలువురు మహిళా నేతలు, ఉన్నతాధికారులు, లాయర్లు, డాక్టర్లు, ఇంకా మహారాష్ట్ర పర్భనీ, మాన్వట్ వంటి జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు పలువురు ప్రముఖులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా.బిఆర్‌ఎస్ నేతలు హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి బిబి పాటిల్, శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, ఎస్ వేణుగోపాలచారి, ముంబై ధారవి దేవానంద్ నాగెల్ల, షిరిడీ నుంచి రమేశ్ బండారం తదితరులున్నారు.