Monday, December 23, 2024

ఆరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి..

- Advertisement -
- Advertisement -

క్రీడావిభాగం: టీమిండియా యువ కెరటం యశస్వి జైస్వాల్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి సంప్రదాయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. మొదటి మ్యాచ్‌లోనూ కళ్లు చెదిరే శతకంతో కనువిందు చేశాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు రికార్డు పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. ఆ తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఆరంభ మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే ప్రదర్శనతో యశస్వి కోట్లాది మంది అభిమానుల మనసును గెలుచుకున్నాడు. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని క్రికెట్ ఆడే అన్ని దేశాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా యశస్వి బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆరంభ మ్యాచ్‌లోనే అతను ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడిగా బ్యాటింగ్‌ను కొనసాగించాడు.

ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించిన యశస్వి డబ్లూటిసి ఫైనల్లో స్టాండ్‌బైగా టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆ ఫైనల్లో అతనికి ఆడే అవకాశం రాలేదు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో యశస్వికి తుది జట్టులో చోటు దక్కింది. అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. యశస్వి కూడా అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచుకున్నాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ కళ్లు చెదిరే శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఆరంగేట్రం టెస్టులోనే సెంచరీలు సాధించిన క్రికెటర్ల సరసన చోటు సంపాదించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి 143 పరుగులతో అజేయంగా ఉన్నాడు. శుక్రవారం మూడో రోజు అతను మరిన్ని పరుగులు సాధిస్తాడో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News