సిటిబ్యూరోః మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఒంటరిగా వెళ్తున్న వారిని దోచుకుంటున్న ఆరుగురు నిందితులను మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 12,400 నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి చందనదీప్తి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన సందీప్ బహదూర్, ఆలురు దిలీప్, బెజ్జంకి రాజేష్, పసుపుల కిరణ్, ఎండి సమీర్, పాడేరు మణికంఠ కలిసి నేరాలు చేస్తున్నారు. ఆరుగురు నిందితులు అర్ధరాత్రి వరకు మద్యం తాగుతున్నారు.ఈ నెల 13వ తేదీన ఆరుగురు కలిసి మద్యం తాగారు, వారికి అప్పటి వరకు మద్యం సరిపోకపోవడం,
వారి వద్ద డబ్బులు లేకపోవడంతో ఒంటిరిగా ఉన్న వారి వద్ద నుంచి దోపిడీ చేయాలని ప్లాన్ వేశారు. వెస్ట్‌మారెడ్‌పల్లి సమీపంలోని గాంధీ కాలనీలోని ఓపెన్ ఏరియాలో నిద్రిస్తున్న సూరజ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతడిని కొట్టి పది వేల రూపాయలు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. అలాగే బిహారి యాదవ్ వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.1,700 నగదు, భాను ప్రసాద్ వద్ద మొబైల్ ఫోన్ తీసుకుని పారిపోయారు. ముగ్గురు బాధితులు కలిసి మారెడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.