Friday, November 22, 2024

హమారా..ఇస్రో మహాన్

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : చంద్రుని వైపు, ఆ తరువాత గ్రహాంతర దిశలో కీలక మైలురాయిగా, ఓ ముఖ్యమైన ముందడుగుగా శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయింది. జాబిల్లిపై అన్వేషణల ఘట్టంలో ఆద్యంతం ఆసక్తికరమైన దశగా ఇప్పుడు ఉపగ్రహం నిర్ధేశిత కక్షలోకి చేరడం ద్వారా ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగవేదిక నుంచి ఎల్‌విఎం 3 ఎం 4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ మధ్యాహ్నం 2.35 గంటలకు వెన్నంటిన 130 కోట్ల మంది భారతీయుల ఆశలు, భవిత ఆకాంక్షలను మోసుకుంటూ దూసుకువెళ్లింది. ఇదో ఉత్కంఠభరిత క్షణాల సమాహారం. దీని నుంచి శాటిలైట్ అయిన చంద్రయాన్ వాహకనౌక తొలి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని చంద్రుడివైపు ప్రయాణం సాగించింది.

రాకెట్ ప్రయోగం తరువాత 16 నిమిషాలకు చంద్రయాన్ 3 దీని నుంచి విడిపోయింది. బాహుబలి రాకెట్‌గా ఇస్రోకు విశ్వసనీయమైన ఎల్‌విఎం రాకెట్ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్స్‌ను మోసుకుని నింగిలోకి ఎగిరింది. సకాలంలో ఇంధన పేలోడ్‌ను మండించడంతో తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ తరువాత చంద్రుడివైపు చంద్రయాన్ శాటిలైట్ వెళ్లేందుకు వీలుగా మధ్యాహ్నం 02.42 గంటల సమయంలో మూడో దశ పేలోడ్‌ను మండించారు. ఈ మూడు దశలు నిర్ణీత ప్రణాళికల ప్రకారం సజావుగా జరిగినట్లు శాస్త్రవేత్తలు నిర్థారించారు. స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి వైపు ప్రయాణానికి అవసరం అయిన ఎత్తుకు చేర్చేందుకు అవసరం అయిన దశలను పూర్తి చేసుకున్న తరువాత మధ్యాహ్నం 02.54 గంటల సమయంలో ఇది జాబిల్లి వైపు ప్రయాణం ఆరంభించినట్లు నిర్థారించుకున్నామని ప్రయోగవేదిక వద్దనే ఉన్న ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు.

ఇది దేశ అంతరిక్ష రంగంలో చారిత్రాత్మకమైన దినం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పేలోడ్‌లు సంధించే ప్రతిఘట్టం నిమిషాల వారిగా అత్యంత కీలకమైనది. ఇది సజావుగా సాగే వరకూ కాలం గడుస్తున్న కొద్దీ ఇస్రో సైంటిస్టులు, సిబ్బందిలో అనుక్షణ ఉద్వేగం నెలకొంది. చంద్రయాన్ నిర్ణీత కక్షలోకి చేరడంతో శాస్తవేత్తలు పరస్పర అభినందనలతో వేదిక వద్ద సంబరాలు నిర్వహించుకున్నారు. అక్కడే ఉన్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్రసింగ్ , ఇస్రో ఛైర్మన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇది దేశానికి అత్యంత ముఖ్యమైన దశ అని కేంద్ర మంత్రి తెలిపారు. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23 సాయంత్రం 5.47కు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుందని సోమ్‌నాథ్ వివరించారు.

శుభాకాంక్షలు..ఇండియా చంద్రయాన్ 3 వాహకనౌక ఇప్పుడు నిర్ణీత కక్షలో భూమి చుట్టూ తిరుగుతోందని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. చంద్రుడి కక్షలోకి దీనిని చేర్చే ఘట్టం ఆగస్టు 1 నుంచి ఆరంభమవుతుంది. ఎల్‌విఎం రాకెట్ ఈసారి కూడా తమ అంచనాలను నిజం చేస్తూ నిజంగానే బాహుబలిగా సక్సెస్‌ను సాధించిందని ఈ యాత్ర డైరెక్టర్ ఎస్ మోహన్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రయాన్‌కు సంబంధించి అన్ని కొలమానాలు సక్రమంగా ఉన్నాయని, అంతా సవ్యంగా సాగుతోందని ప్రాజెక్టు డైరెక్టర్ పి వీరముత్తువెల్ చెప్పారు. ప్రత్యేకించి ఇంధన జ్వలితం , ల్యాండర్ మాడ్యూల్ సవ్యంగా ఉన్నాయని వివరించారు.

చంద్రయాన్ కల నెరవేరడంలో కీలక మజిలీలు
..ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడుకున్నదే చంద్రయాన్ 3 శాటిలైట్. ఇది 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటివరకూ చంద్రుడివైపు ప్రయాణాలు సాగించిన ఇతర దేశాలు అమెరికా, రష్యా, చైనాలు తమ ప్రయోగాల దశలో భూమి చుట్టు ప్రయాణించడం అతి తక్కువ రోజులు సాగించాయి. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు భారతదేశం సుదీర్ఘకాలం భూ భ్రమణపు చంద్రయాన్‌ను తలపెట్టింది. తరువాత ఇంధన జ్వలిత ప్రక్రియలతో కక్షను పెంచుతారు.
..తరువాతి దశలో చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ 3 ప్రవేశం జరుగుతుంది.
..భూ గురుత్వాకర్షణ క్షేత్రం దాటిన తరువాత నెలకొని ఉండే చంద్రుడి క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించిన తరువాత కీలకమైన ఎల్‌ఒఐ ప్రక్రియ చేపడుతారు. ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియగా దీనిని పిలుస్తారు. ఇందులో భాగంగా నిర్థిష్ట రీతిలో ఇంజిన్‌ను మండించి చంద్రయాన్ 3 వేగం తగ్గిస్తారు. దీనితో ఈ వ్యోమనౌక పూర్తిగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి వెళ్లుతుంది. ఈ దశ నుంచి చంద్రుడి కక్షలోకి ఒదిగిపోతుంది.
..తరువాత చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి దీనిని ప్రవేశపెడుతారు.
..ఆగస్టు 23 లేదా ఖచ్చితంగా 24వ తేదీన మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన భాగం విడిపోతుంది.
..చంద్రయాన్ వాహకనౌక కీలక మాడ్యూల్ గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా సాగుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఉంటుంది.
..ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుంది. దీనితో ఇక చంద్రుడిపై అన్వేషణల దశ వేగవంతం అవుతుంది.
సాఫ్ట్‌ల్యాండింగ్ అత్యంత కీలక ఘట్టం
చంద్రుడిపైకి ఇప్పుడు చేపట్టిన యాత్రలో అత్యంత సంక్లిష్టమైన ఘట్టం ఎగుడుదిగుడులు, లోయలు ఎత్తుల ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంతకు ముందు చంద్రయాన్ 2 ఈ దశలోనే విఫలం అయింది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు చంద్రుడిపై వాలే ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలూ చేపట్టారు. ఇప్పటి విజయం ఆద్యంతం సంపూర్ణతను సంతరించుకునేది ఆగస్టు 23న సాఫ్ట్‌ల్యాండింగ్ సజావుగా సాగితేనే సాధ్యం అవుతుంది. 15 సంవత్సరాలలో ఇస్రో చంద్రయాత్రలో ఇది మూడో ప్రయోగం.

హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువనే
చంద్రయాన్ 3కు అయిన వ్యయ బడ్జెట్ రూ 600 కోట్లుగా అంచనావేశారు. ఇది ఓ హాలీవుడ్, కొన్ని తెలుగు సినిమాల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే తక్కువే. చంద్రయాన్ 2 దశలో ల్యాండర్ విక్రమ్‌తో సరైన విధంగా కమ్యూనికేషన్ లేకపోవడంతో సాఫ్ట్ ల్యాండింగ్ జరగకపోవడం అపజయానికి దారితీసింది. ఇప్పుడు చంద్రయాన్‌ను తీసుకుని వెళ్లిన రాకెట్‌ను దీని బరువు మోసే శక్తి సామర్థాలతో ఫాట్‌బాయ్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడిది తన బరువు, చంద్రయాన్ బరువును మోసుకుంటూ వయ్యారంగా ముందుకు సాగింది. ప్రయోగం దశలో ఆకాశంలో దట్టమైన నారింజ రంగు పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతానికి వేలాదిగా తరలివచ్చి ఈ ప్రయోగ అత్యద్భుత ఘట్టాన్ని తిలకించారు. ఈ ప్రాంతం అంతా క్లైమాక్స్ దశలో కేరింతలతో దద్దరిల్లింది. చందమామ అందేరోజు కల ఇక నిజం కానుందనే ఆకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇది గ్రహాంతర పరిశోధనల ప్రయోగం
చంద్రయాన్ 3 కేవలం చంద్రుడి రహస్యాలను ఛేదించే కీలక ప్రయోగం అనుకోరాదని సైంటిస్టులు తెలిపారు. ఆ తరువాత పలు విశ్వ అనావిష్కృత గ్రహాల పరిశోధనల దిశలో ఇదో కీలక దశ అవుతుందని చెప్పారు. మన శాస్త్రవేత్తలు సాగించిన విశేష ప్రతిభ అంతకు మించిన శ్రమకు ఫలితం దక్కితే ఇక ప్రపంచంలో చంద్రుడిని ఛేదించే ప్రపంచ దేశాల క్రమంలో భారత్ నాలుగో దేశం అవుతుంది. ఇప్పటికీ అమెరికా, చైనా , రష్యాలు (సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పుడు ) ఈ వరుసలో నిలిచాయి. చంద్రయాన్ 1 2008లో, 2019లో చంద్రయాన్ 2 సాగాయి.
చంద్రుడి దక్షిణ ధృవం ఉత్తర భాగంతో పోలిస్తే సువిశాలం. అక్కడ అపారంగా జలవనరులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించి నిజంగానే చంద్రుడి పెరడు వంటి ఈ భాగానికి చంద్రయాన్ సాగుతోంది. చంద్రుడిలో కన్పించే నీలినీడల ప్రాంతం అంతా జలరాశులు ఉండే చోటు అని గుర్తించి, వీటిపై సమగ్ర అధ్యయనానికి చంద్రయాన్ 3 చేపట్టారు. దీనిలో ఇప్పుడు అనుసంధానించిన షేప్ ( స్పెక్ట్రో పోలారిమెట్రిక్ హబిటేబుల్ ప్లానెట్ ఎర్త్)తో భూమిని చంద్రుడి కక్షలో నుంచి అధ్యయనం చేసేందుకు వీలేర్పడుతుందని సైంటిస్టులు తెలిపారు.

ఆకాశం హద్దులు మించి, విక్రమ్‌సారాభాయ్ కలల సాకారం దిశలో
కేంద్ర సైన్స్ మంత్రి జితేంద్ర స్పందన
సైంటిస్టులతో కలిసి సంబరాలు చేసుకున్న తరువాత కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ మాట్లాడారు. శ్రీహరికోట నుంచి అంతరిక్షం వైపు భారతదేశ ప్రయాణాన్ని సాధ్యం చేసే దిశలో ప్రధాని మోడీ కీలక బాధ్యత వహించారని ప్రశంసించారు. ఆకాశం హద్దులు దాటి ముందుకు వెళ్లాలని మోడీ ఉద్బోధిస్తూ వస్తున్నారని, ఈ క్రమంలోనే ఈ విజయం ఓ ముందడుగు అన్నారు. భారత అంతరిక్ష పితామహుడు అయిన సైంటిస్టు విక్రమ్ సారాభాయ్ కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయని తెలిపారు. భారతీయ ఖ్యాతిని ఖండాంతరమే కాదు గ్రహాంతరం సాగించేందుకు ఇదో మైలురాయి అన్నారు.

రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖుల అభినందనలు
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తమ స్పందనలో దేశ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇది మరో కీలక ఘట్టం అన్నారు.శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ పురోగతికి ఇది ప్రతీక అనితెలిపిన రాష్ట్రపతి ఈ ప్రయోగ విజయవంతానికి కారకులైన ఇస్రో బృందాన్ని అభినందించారు. భారత అంతరిక్ష ప్రయాణం విజయవంతం కావడం నూతన అధ్యాయం అని ప్రధాని మోడీ తెలిపారు. ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. పారిస్ నుంచే ఇస్రో బృందానికి అభినందనలు పంపించారు. ప్రతి భారతీయుడి ఆకాంక్షలకు ఇది సమున్నత గౌరవ ప్రదాయక క్షణం అని అభివర్ణించారు.

చంద్రుడి గురించి పలు కథలు చదివాం. ఇదో వెన్నెల విరజిమ్మే నిస్సార ప్రాంతం అనుకున్నారని, నివాస యోగ్యం కాదనే అభిప్రాయం ఉందన్నారు. అయితే ఇప్పుడు జరిగిన పరిశోధనల క్రమంలో చంద్రుడిపై చైతన్యం ఉందని. జలం, అంతర్గత మంచు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించడంతో ఇక ముందు చంద్రుడు కూడా మానవ మజిలీకావచ్చునని చెప్పారు. 14 జులై 2023 భారత అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించేరోజు అవుతుందన్నారు. మన ముచ్చటైన మూడో చంద్రయాత్ర చూడముచ్చటైన విజయం సాగిస్తోందని ట్వీటు వెలువరించారు . ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

భారతదేశ చంద్రయాన్ యాత్ర ..కీలక మజిలీలు
వాజ్‌పేయి పెట్టిన పేరు…మన సైంటిస్టుల ప్రతిభకు ఆనవాలు
ఇస్రో తలపెట్టిన చంద్రయాన్‌కు విశేష సుదీర్ఘ చరిత్ర ఉంది. సంబంధిత చంద్రుడి అన్వేషణ క్రమపు ఘట్టాల విషయాలు పలు దశల్లో సాగిన మలుపులు అనేకం ఉన్నాయి. ఈ వివరాలు
2003 ఆగస్టు 15 ః అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చంద్రుడిపై అన్వేషణ దిశలో ఇస్రో విశిష్ట పరిశోధనలు చేపడుతుందని దీనికి చంద్రయాన్ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు.
2008 అక్టోబర్ 22 ః చంద్రయాన్ 1 శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగంగా దూసుకువెళ్లింది.
2008 నవంబర్ 8ః చంద్రయాన్ 1 చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది.
2008 నవంబర్ 14 ః చంద్రయాన్ 1 నుంచి చేపట్టిన అన్వేషణల క్రమంలో చంద్రుడి దక్షిణ ధృవంలో అపార జలరాశులు ఉన్నట్లు గుర్తించారు, చంద్రుడు నిజానికి జలకణజాలపు ఉపరితల సంచలిత ప్రాంతంగా ఉన్నాడని నిర్థారించారు.
2009 ఆగస్టు 28ః చంద్రయాన్ 1 పరిశోధనల దశ ముగిసినట్లు ఇస్రో తెలిపింది.
2019 జులై 22 ః చంద్రయాన్ 2ను శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగించారు. ఇది ఈ దశలో విజయవంతం అయింది.
2018 ఆగస్టు 20 ః చంద్రయాన్ 2 వ్యోమనౌకను చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టారు.
2019 సెప్టెంబర్ 2 ః విక్రమ్ ల్యాండర్‌ను వేరు చేశారు. దక్షిణ ధృవంలో 100 కిలోమీటర్ల ఎత్తున ఇది చంద్రుడిపై ల్యాండ్ అయ్యే దశలో సరైన విధంగా కమ్యూనికేషన్స్ లేకపోవడంతో సవ్యంగా ల్యాండ్ కాలేకపోయింది.
2023 జులై 2023 ః చంద్రయాన్ 3 ప్రయోగం శ్రీహరికోట నుంచే సాగి విజయవంతం అయింది. ఆగస్టు 23 లేదా 24కు చంద్రుడి ఉపరితలంపై వాలాల్సి ఉంది. దీనితో ఇటువంటి ఘనకీర్తి దేశాల సరసన చేరే నాలుగో దేశం కానుంది.

చంద్రుడివైపు మనం సూపర్‌హిట్ హీరో మహేష్ బాబు ఆనందం
చంద్రుడివైపు తొలి అడుగు సూపర్ హిట్ అయింది. ఇక భారతీయ సైన్స్ ఖ్యాతి ఖండాంతరంతో పరిమితం కాకుండా విశ్వాతరం, గ్రహాంతరం కానుందని చంద్రయాన్ ప్రయోగం విజయవంతంపై హీరో మహేష్ బాబు స్పందించారు. దీనిని విజయవంతం చేసిన సైంటిస్టులు, ఇస్రో బృందంవారే సూపర్ హీరోలు, తిరుగులేని స్టార్స్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News