ఇటీవల టిపిసిసి రేవంత్ రెడ్డి, కరెంటుపై చేసి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ రెండు రోజుల ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్, రేవంత్ రెడ్డి కామెంట్స్ తో డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. విధాన పరమైన నిర్ణయాలు, పార్టీ మేనిఫెస్టో హైకమాండ్ నిర్ణయిస్తుందని పార్టీ రాష్ట్ర వ్యవహార ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీలో చర్చించి తీసుకొనే నిర్ణయాలు మినహా వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని స్పష్టంగా ప్రకటించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ కు మద్దతుగా నిలిచారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రకటించారు. కాంగ్రెస్ విధానంలోనే ఉచిత విద్యుత్ ఉందని, రైతులకు అన్ని వేళలా అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేసారు. తెలంగాణలోనూ రైతులకు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కొనసాగిస్తుందని..వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా పార్టీ వైఖరిలో మార్పు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.
అమెరికా లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంది…ఉంటుందని చెప్పారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇవ్వడంతో పాటు, రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం అని వివరించారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక పై కాంగ్రెస్ విధానం అందరికీ తెలిసిందేని రేవంత్ చేసిన సీతక్క సీఎం వ్యాఖ్యల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చర్చించి ఎవరికీ నాయకత్వం ఇవ్వాలో నిర్ణయిస్తారని వివరించారు.
బిఆర్ఎస్, బిజేపిలు కలిసి పనిచేసినా కాంగ్రెస్ పార్టీ యే అధికారంలోకి రాబోతుందని టీ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ తరువాత ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెబుతున్నారు. తెలంగాణ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను అందిస్తామని కాంగ్రెస్ నేతలు ముక్త కంఠంతో ప్రకటిస్తున్నారు. “ఇందిరమ్మ రైతు భరోసా” పధకం ద్వారా కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన “రైతు డిక్లరేషన్”ను యధాతధంగా అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు.