అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ వారాహి విజయయాత్ర పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసిపి నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అదే స్థాయిలో వైసిపి నాయకులు పవన్ పై విరుచుకుపడుతున్నారు.
తాజాగా పవన్ పై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని, ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలి అన్నారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడని, పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తన స్పీచ్ లో 373 సార్లు జగన్ పేరును ఉచ్చరించాడని, వెయ్యి సార్లు జగన్ పేరు ఉచ్చరించటం పూర్తి చేస్తే పవన్ పాపాలు కొన్నైనా కొట్టుకుపోతాయని అంబటి రాంబాబు విమర్శించారు.
పవన్ కల్యాణ్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. పవన్ కు హిందూ ధర్మం మీద, హిందూ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదన్నారు. నీచాతి నీచంగా మాట్లాడే పవన్ కు హిందూ మతం గురించి మాట్లాడే హక్కు లేదని నిప్పులు చెరిగారు.