Monday, December 23, 2024

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం కక్ష సాధింపు

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల :పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజిఆర్ గార్డెన్స్‌లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డిలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి తాగు, సాగునీటి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 85శాతం పూర్తి ఆయ్యాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల పరిధిలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించారు. కాంగ్రెస్, బిజెపి దొందు దొందే అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌లు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రావని చెప్పడం చోద్యంగా ఉందన్నారు. ఇప్పటికే 85 పనులు పూర్తయ్యాయని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు అనుమతులు, జాతీయ హోదా ఇచ్చేవరకు బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణలో భాజపాను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన పేర్కొన్నారు. భాజపాకు క్యాడర్ లేదు… కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడని వారు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపి , కాంగ్రెస్‌లకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో వందకు వందశాతం బీఎర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ సారి బీఆర్‌ఎస్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపిపి మల్గారి విజయలక్ష్మీరమణారెడ్డి, చేవెళ్ల జడ్పిటిసి సభ్యురాలు మర్పల్లి మాలతికృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, రమణారెడ్డి, నాగార్జునరెడ్డి, చేవెళ్ల, మొయినాబాద్ మండల పార్టీల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, మహేందర్‌రెడ్డి, చేవెళ్ల మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్‌గౌడ్, దేవరంపల్లి సర్పంచ్ నరహరిరెడ్డి, నాయకులు సయ్యద్ మోసిన్, వెంకటేష్, రాములు, అమరేందర్‌రెడ్డి,బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పొట్ట దయాకర్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News