హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్, మరొకరికి దీనిపై మాట్లాడే హక్కులేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుతున్న సాగునీరంతా కాంగ్రెస్ చలవేనని పునరుద్ఘాటించారు. గాంధీభవన్‌లో ఆయన తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో 109 రోజుల పాటు 1,364 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన భట్టి విక్రమార్క తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజల అవసరాలే కాంగ్రెస్ పార్టీ అజెండా అని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి 53 శాతానికిపైగా విద్యుత్ కేటాయింపు జరిగిందని ఆయన వివరించారు. మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన తన పాదయాత్ర జూలై 2వ తేదీన ఖమ్మంలో ముగిసింద న్నారు. అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాలతో నిర్వహించిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం తనకు కలిగిందన్నారు. అడుగడుగునా ప్రజలు తమ ఇబ్బందులను తనకు తెలియజేశారని ఆయన వివరించారు. రాష్ట్రంలో పేదలకు, ధనికులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అంతరాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పంటలకు అందుతున్న సాగునీరంతా కూడా కాంగ్రెస్ హయంలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచేనని ఆయన వెల్లడించారు.
సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి
సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని, దానిని ప్రైవేట్ పరం కాకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు అప్రస్తుతమని ఇందిరమ్మ పాలన తీసుకురావడమే తమ ఎజెండగా పనిచేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాచరణను ఆయన వివరించారు. ప్రాజెక్టులను సందర్శించి అక్కడ సెల్ఫీలు తీసుకుంటామని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు, ఖర్చు, ప్రయోజనాలను కూడా ప్రజలకు వివరిస్తామని భట్టి వెల్లడించారు.