Saturday, November 23, 2024

రేవంత్ రెడ్డినీ స్థాయిని మించి విమర్శలు మానుకో

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, వ్యవసాయంపై కనీస అవగాహన లేకుండా విద్యుత్‌పై మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖబడ్దార్ అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేక కాంగ్రెస్, బిజెపి వాళ్లు అనవసర విషయాలను తెరపైకి తెస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతాంగం, ప్రజలను అన్ని విధాల ఆదుకుంటూ, యావత్ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి, మూడోసారి సిఎం గా కెసిఆర్ అవుతారని తెలిసి కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలందరికి తెలుసని, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వీడియో, ఆడియోలను వక్రీకరించారని ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రజలంతా మద్దతుగా ఉన్నారని, రైతులను ద్రోహం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, బిజెపిల కల్లిబొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. అనసవసర విమర్శలు, ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
సిఎం కెసిఆర్, కెటిఆర్ స్పీకర్, గుత్తాలపై విమర్శలా..!
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలపై విమర్శలు, ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. నోటుకు ఓటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు, భూ కబ్జాలు, బెదిరింపులు చేసే రేవంత్ రెడ్డి, వారి సోదరుల చరిత్ర ఏంటో అందరికి తెలుసన్నారు. మా నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసిఆర్ హయాంలో ఎంతో సుభిక్షంగా ఉన్నారని, మరోసారి మూడోసారి సీఎం కేసిఆర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తున్న స్పీకర్‌పై, కుటుంబంపై మరోసారి ఆరోపణలు చేస్తే బాన్సువాడలో అడుగు పెట్టనివ్వబోమన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంతంగా, ప్రజల మద్దతుతో ఈ స్థాయిలో ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో తన పదవికి, టిడిపికి రాజీనామా చేసి గెలిచారని, తెలంగాణ ఉద్యమంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన రేవంత్ రెడ్డికి స్పీకర్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు.
బండి సంజయ్ గతే నీకు పడుతుంది
అనవసర మాటలు మాట్లాడే బిజెపి నాయకుడు బండి సంజయ్ గతే రేవంత్ రెడ్డికి పడుతుందని, రాజ్యాంగ బద్ద పదవిలో, పెద్దాయన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై విమర్శలు, ఆరోపణలు చేసే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం కేసిఆర్, కేటిఆర్, స్పీకర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలపై వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఎంపీ స్థానం నుంచి బహిష్కరించాలని, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు నిరసనలు, ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, మాజీ ఎఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాజ్, ఇబ్రహీంపేట్ సర్పంచ్ నారాయణ రెడ్డి, నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News