Monday, December 23, 2024

ధరల నియంత్రణలో కేంద్రం విఫలం

- Advertisement -
- Advertisement -
టమాటా రేట్లే ప్రత్యక్ష ఉదాహరణ
సంఘ్ పరివార్ వల్లే మణిపూర్‌లో మంటలు – తెలుగు రాష్ట్రాల్లోకి బిజెపిని రానివ్వం
మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వచ్చే వారితో కలిసి పనిచేస్తాం
సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో బివి రాఘవులు

హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రాబల్యం రోజురోజుకు వేగంగా దిగజారుతున్నదనీ, పెరుగుతున్న ధరలను నియం త్రించడంలో ఆ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్‌బి భవన్ లో శనివారం ప్రారంభమైన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ద్రవ్యోల్బణం 4.8 శాతానికి చేరిందన్నారు. కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పాలు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయనీ, టమాటా ధర రూ.150కి చేరిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకి టమాటా ధరే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం అన్ని రాష్ట్రాలకు డబ్బు కేటాయించి, సబ్సిడీపై నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని సూచించారు. టోకు వ్యాపారులకు కనక వర్షం కురిపించడం కోసమే మోడీ సర్కారు ధరల నియంత్రణ చర్యలు చేపట్టల్లేదని విమర్శించారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందే ఉద్దేశంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లా కమిషన్ ముందు పెట్టిన ఉమ్మడి పౌరస్మృతి(యూసిసి) అంశంపై చర్చను లేవదీసిందని విశ్లేషించారు.

మణిపూర్‌లో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, విధ్వంసాన్ని సృష్టించ డంలో సంఘ్‌పరివార్ పాత్ర ప్రధానమైందని విమర్శించారు. అక్కడి మైటీ, కుకీ తెగల మధ్య మతం ప్రాతిపదికన విద్వేష బీజాలను సంఘ్ పరివార్ శక్తులు చాలా కాలం నుంచి చాటుతున్నాయని తెలిపారు. ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రిజర్వేషన్ సమస్యను సక్రమంగా పరిష్కరించకుండా, వివాదాస్పదం చేసి, ఘర్షణ వాతావరణం తలెత్తడానికి కారణమైందని వివరించారు. దేశంలో ఎక్కడో దగ్గర వైషమ్యాలు సృష్టించి, ప్రజల దృష్టిని మళ్లించి, దొడ్డితోవన విద్యుత్ ఛార్జీలు పెంచడం, మోటార్లకు మీటర్లు బిగించడం, కరెంటుకు పగలు ఒక ఛార్జి, రాత్రి మరొక ఛార్జి అంటూ సంస్కరణల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

పట్టణ సంస్కరణల పేరుతో రాష్ట్రాల్లో నీరు, చెత్త, మురుగుపారుదల వంటి వాటిపై యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆస్తిపన్ను పెంచేందుకు బిల్డింగ్ రూల్స్, భూ వినియోగ నిబంధనలను నిర్మాణ కంపెనీలకు అనుకూలంగా మారుస్తున్నారనీ, మురికి వాడల అభివృద్ధి పేరుతో బిల్డర్స్‌కు భూమిలో వాటా కల్పించాలనే షరతులు విధిస్తున్నారని చెప్పారు. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే కేంద్రం నుంచి నిధులు ఇవ్వబోమని షరతులు విధిస్తున్నారని వివరించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించటం సిపిఎం ముఖ్యమైన కర్తవ్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. దాని కోసం భావసారూప్యత కలిగిన రాజకీయ శక్తులను సమీకరించటానికి కృషి చేస్తున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News