Saturday, December 21, 2024

సొరంగం లోకి వరద … 9 మృతదేహాలు వెలికితీత

- Advertisement -
- Advertisement -

సియోల్ : దక్షిణ కొరియాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి మరణాలు పెరుగుతున్నాయి. ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. చెంగ్జూలో నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌పోంగ్ సొరంగం లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవేశించడంతో 12 కార్లు, బస్సు, సహా 15 వాహనాలు చిక్కుకుపోయాయి. శనివారం ఈ నగరంలో కురిసిన భారీ వర్షాలకు సమీపం లోని మిహోవ్ నది కట్టలు తెంచుకుని నగరం లోకి ప్రవేశించడంతో వరద నీరు సొరంగంలోకి చొచ్చుకు వచ్చింది. చిక్కుకున్న వాహనాల్లోంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లభించలేదు. దీంతో ఆదివారం నాటికి సొరంగం నుంచి తొమ్మిది మృతదేహాలను వెలికి తీయ గలిగారు. మరో పది మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. వాహనాల్లో ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియడం లేదు. గజ ఈతగాళ్లతోసహా దాదాపు 900 మంది రిస్కు బృందం సొరంగాన్ని గాలిస్తున్నారు.

సొరంగం నుంచి నీటిని తోడివేయడానికి అనేక గంటలు పడుతోందని, అయినా ఇంకా 13 నుంచి 16 అడుగుల లోతున నీరు నిలిచి ఉందని నార్త్ చుంగ్‌చెయోంగ్ ప్రావిన్సియల్ ఫైర్ డిపార్టుమెంట్ అధికారి యాంగ్ చాన్ మో చెప్పారు. సొరంగంలో చిక్కుకున్న బాధితులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడానికి సిబ్బంది పాటుపడుతున్నారు. జులై 9 నుంచి దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా 37 మంది మృతి చెందారు. వేలాది మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు 8850 మందిని ఖాళీ చేయించారు. గత కొన్ని రోజులుగా 27, 260 ఇళ్లకు కరెంట్ లేదు. వర్షాలకు 50 రోడ్లు దెబ్బతిన్నాయి. వందకు పైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జులై 9 నుంచి చుంగ్‌జెయోంగ్ ప్రావిన్సియల్ పట్టణాలైన గోంగ్‌జు, చెయోగ్యాంగ్ ల్లో 60 సెంమీ కన్నా ఎక్కువగా వర్షం కురిసింది. సొరంగం ఉన్న ప్రాంతంలోనే దాదాపు 54 సెంమీ వర్షం కురిసింది. మరిన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News