హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర పర్యవేక్షణ, మార్గనిర్దేశనంలో రెండేండ్లలో ఐదు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించామని సిఎం ఒఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే వెల్లడించారు. ఈ ఐదు ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వ అను మతుల కోసం రేండేళ్ల నుంచి క్రమం తప్పకుండా ఢిల్లీలోని ఆయా శాఖల అధి కారులను, సిబ్బందిని కలుస్తూ ప్రాజెక్టుల అనుమతుల కోసం కృషి చేశామని తెలిపారు. ఇంకా నాలుగు ప్రాజెక్టులు మిగిలాయని, ఆగస్టు చివరి నాటికి మ రో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని చె ప్పారు. ఇది సిఎం కెసిఆర్ తమకు కీలకమైన బాధ్యతను అప్పగించి నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ స్థితిని తెలుసుకుంటూ మార్గని ర్దేశనం చేశారని చెప్పారు. ఈ మేరకు శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఫేస్‌బుక్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ‘ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడం కంటే అంతరిక్ష పరిశోధనలు చాలా సులభం అని, కేంద్ర అనుమతులు పొందడం చాలా చాలా కఠినమైన పని” అని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి తరుచూ అనేవారని ఈ సందర్భంగా దేశ్‌పాండే గుర్తు చేశారు.
ఎస్.కె.జోషి చెప్పినట్టు కేంద్రం నుంచి అనుమతులు సాధించడం నిజంగా కష్టతరమైన పని అని పేర్కొన్నారు. గతంలో ఏళ్ల తరబడి ఢిల్లీ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి వదిలేసేవాళ్ళు అని, ఇప్పుడు పట్టు వదలకుండా కేంద్ర జల సంఘాన్ని ఒప్పించి, మెప్పించి అనుమతులు సాధించుకొని వస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఒక శాశ్వత కార్యాలయం తెరిచామని, డిపిఆర్‌ల తయారీ కోసం ఆ విషయంలో అనుభవం ఉన్న ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకున్నామని వివరించారు. ఆయన తమ సిబ్బంది కంటే ముందే సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీసు చేరుకుని, వాళ్ళు పోయిన తర్వాతనే తెలంగాణ భవన్‌కు వెళతారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తమ వసతి కోసం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో 4వ అంతస్తును మొత్తంగా కేటాయింపజేశారని, తాను, కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరాం నెలకు రెండు సార్లు, కొన్ని నెలల్లో మూడు సార్లు కూడా ఢిల్లీ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది కూడా తమతో వచ్చేవారని చెప్పారు.
ఇన్నిసార్లు ఢిల్లీకి తిరగడంతో తమకూ అలసట అనిపించేది.. ఇదేమి తిరుగుడు అని అంతర్గతంగా తమకు అనిపించిన భావనను వివరించారు. ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ ఏమైంది..?…ఎంత వరకు వచ్చింది..? అని సిఎం కెసిఆర్ అడగగానే మళ్లీ ఢిల్లీకి పరుగులు పెట్టే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. రెండేళ్లలుగా ఢిల్లీలోని కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేసి, పట్టువదలకుండా ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకొని వస్తున్నామని వెల్లడించారు. సిడబ్లూసి అనుమతులు కాకుండా పర్యావరణ అనుమతులు, మోటా (ఎంఒటిఎ) అనుమతులు, సిఇఎ అనుమతులు, జాతీయ వన్య ప్రాణి సంరక్షణ బోర్డు అనుమతులు వేరు అని, వాటిని కూడా సాధించుకొని వస్తున్నామని వివరించారు. ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు సాధించడం వెనుక డ్రైవింగ్ ఫోర్స్ మొత్తం ముఖ్యమంత్రి కెసిఆరే అని శ్రీధర్‌రావు దేశ్‌పాండే పేర్కొన్నారు.
ఇటీవల గూడెం, మోడికుంటకు తుది అనుమతులు
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గూడెం, మోడికుంట ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఇటీవల తుది అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో కొనసాగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. దీనిపై తెలంగాణ ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు.