హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో బిజెపి టిఫిన్ బాక్స్ బైఠక్‌ను నిర్వహించింది. పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒకే పరివారమని చాటేలా, వివిధ అంశాలపై చర్చలు జరిగేలా పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ భేటీలకు పార్టీ శ్రేణులు ఎవరికి వారే టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని, సహపంక్తి భోజనాలు చేశారు. ఫొటోలు, వేదిక, బ్యానర్లు, భారీగా భోజనం ఏర్పాట్లు వంటి రాజకీయ హంగు,ఆర్భాటాలేవీ లేకుండా.. పార్టీ నేతలు, కార్యకర్తలు కలుసుకునేలా వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ భేటీలతో పార్టీ శ్రేణులలో వివిధ అంశాలపై సమన్వయంతో పాటు ఆరోగ్యకరమైన చర్చ జరిగిందని బిజెపి నేతలు వెల్లడించారు. శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. శక్తి కేంద్రాల బాధ్యులకు, నియోజకవర్గం పరిధిలో వంద మంది, అంతకు మించి పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. టిఫిన్ బాక్స్ బైఠక్‌లో ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కరీంనగర్‌లో ఎంపి బండి సంజయ్, గద్వాలలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, ఆర్మూర్‌లో ఎంపి ధర్మపురి అర్వింద్, బోథ్‌లో ఎంపి సోయం బాపూరావు, దుబ్బాకలో రఘునందన్ రావుతో పాటు వివిధ నియోజకవర్గాల పరిధిలో బిజెపి ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.