Saturday, November 23, 2024

చట్టసభలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెంచాలి
బిసిల విద్యా అభివృద్ది కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాలి
కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి: రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ : పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేంద్రం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బిసి కుల గణన చేపట్టాలని రాజ్యసభ సభ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతం కు పెంచి రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ సవరణ చేయాలని.. అసెంబ్లీ-, పార్లమెంట్ సీట్లను 100 శాతం పెంచాలని సూచించారు. పెంచిన సీట్లను ఇంతవరకు అసెంబ్లీ, పార్లమెంట్ గడప తొక్కని బిసి కులాల వారికి నామినేటెడ్ పద్ధతి మీద ఆంగ్లో-ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా నామినేట్ చేయాలని సూచించారు.

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి విద్యా అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు. ప్రత్యకంగా కేంద్ర స్థాయి లో స్కాలర్ షిప్‌లు, ఫీజుల రియంబర్స్‌మెంట్, ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి ‘బి.సి యాక్టు‘ను తీసుకరావాలని కోరారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీ లేయర్‌ను తొలగించి రాష్ట్రంలో కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలన్నారు.

సుప్రీం కోర్టు -హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ,ఎస్టీ,బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర స్థాయిలో రెండు లక్షా కోట్ల బడ్జెట్ తో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టి రాష్ట్రాలకు 80శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలని పేర్కొన్నారు.

జాతీయ బిసి ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేసి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా రూ. 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో,ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News