తొమ్మిదేళ్లలో మోదీ సర్కారు చేసిన కార్యక్రమాలను వివరించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ : న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. సోమవారం ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ – యూకే విభాగం ఆధ్వర్యంలో విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతిలో ఢోల్ వాద్యాలు, వేద మంత్రోచ్ఛారణ, హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 ఏళ్లలో నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను భారతీయ సమాజంలో వచ్చిన మార్పుల గురించి తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆకాంక్షలను పూర్తిచేయడం, విదేశాల్లో వారికి సరైన గౌరవం లభించేలా మోదీ సర్కారు తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం పలువురు యువతీ యువకులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు. సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్స్‌లెన్స్ విద్యార్థులైన యువత చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం అధ్యక్షుడు కుల్‌దీప్ షెకావత్, ప్రధానకార్యదర్శి శ్రీ సురేశ్ మంగళగిరి భారత సంతతికి చెందిన పలువురు పాల్గొన్నారు.