న్యూఢిల్లీ : బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన కేసులో ఆగస్టు 7న తుది విచారణ చేపట్టడానికి సుప్రీం కోర్టు సోమవారం నిర్ణయించింది. దోషులకు రెమిషన్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. 2002 లో గోద్రా రైలు దహన కాండ తరువాత గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరగడమే కాక, ఆమె కుటుంబీకులు ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు జీవితఖైదు పడింది. వారు 15 ఏళ్లు కారాగారంలో గడిపారని గుజరాత్ ప్రభుత్వం వారికి రెమిషన్ కల్పిస్తూ విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై జస్టిస్‌లు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయని, దోషులందరికీ పత్రికా ప్రకటనల ద్వారా, నేరుగా నోటీసులు అందజేయడమైందని వెల్లడించింది. దీనిపై ఆగస్టు 7న తుది విచారణకు నిర్ణయించడమైందని వివరించారు. దీనికి సంబంధించి అన్ని పార్టీలు తమ స్వల్పకాల అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీం కోర్టు కోరింది. మే 9న దోషులకు నేరుగా, పత్రికల ద్వారా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. భానోతోపాటు సిపిఐ(ఎం) నాయకులు సుభాషిణీ అలీ, టిఎంసి ఎంపీ మహువా మొయిత్రా, ఇండిపెండెంట్ జర్నలిస్టు రేవతీ లయూల్, మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ తదితరులు రెమిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.