హైదరాబాద్: సిఎం కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలు గౌరవంగా బతుకుతున్నాయని బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. కెసిఆర్ పాలన చూసి కాంగ్రెస్ పెద్దలు నేర్చుకోవాలన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షుడిని చేసి కాంగ్రెస్ తప్పు చేసిందని మండిపడ్డారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక రేవంత్‌ను ఎందుకు సహిస్తున్నారో అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ చరిత్ర హీనుడని, రెడ్డి సంఘం నుంచి బహిష్కరించాలని, టిపిసిసి అధ్యక్షుడిగా ఉంటే కనీస అర్హత లేదన్నారు.
Also Read: పవన్ అప్పుడు చేగువేరా… ఇప్పుడు సావర్కరా?: నారాయణ
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని రైతులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడని, తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారని శ్రవణ్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో ప్రజల మనసు గెలవలేమని రేవంత్ గ్రహించలేకపోయాడని, బిసిలను అవమానించేలా రేవంత్ తీరు ఉందని దుయ్యబట్టారు. రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ సంస్కృతిని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నా కూడా ఎఐసిసి అతడిని ఎందుకు నియంత్రించడంలేదని శ్రవణ్ అడిగారు. చిల్లర రాజకీయాల కోసం పేదలను రేవంత్ కించపరుస్తున్నారని, ఆయన ఒక మానసిక రోగి అని, క్వారంటైన్‌లో ఉంచాలని సలహా ఇచ్చారు. వెంటనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పిసిసి నుంచి తొలగించాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.