Monday, December 23, 2024

ఏ సమావేశానికీ  ఆహ్వానం రాలేదు: కుమారస్వామి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సారథ్యంలోని జనతా దళ్(సెక్యులర్)కు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నుంచి కాని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఎన్‌డిఎ సమావేశం నుంచి ఎటువంటి ఆహ్వానం అందచలేదని జెడిఎస్ ప్రతినిధి ఒకరు మంగళవారం స్పష్టం చేశారు. తాము ఆ రెండు కూటములలో చేరే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తాము ఆ రెండు సమావేశాలకు హాజరుకావడం లేదని, వేచి చూసే ధోరణిని అవలంబిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టంతా పార్టీ పునర్నిర్మాణం, ప్రజా సమస్యలపైనే ఉందని ఆయన తెలిపారు.

కాగా..జెడిఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ బిజెపి కాని కాంగ్రెస్ కాని తమను ఎందుకు సంప్రదించాలని ప్రశ్నించారు. తమకంటూ ఒక పార్టీ ఉందని, ప్రతిపక్ష పాత్రను తాము సమర్థంగా పోషిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపి రెండింటినీ తాము సమానంగా చూస్తామని ఆయన తెలిపారు. తాము బిజెపితో పొత్తు కుదుర్చుకోనున్నట్లు బయట చర్చ జరుగుతున్నప్పటికీ తనకు మాత్రం ఆ విషయం గురించి ఎటువంటి అవగాహన లేదని కుమారస్వామి తెలిపారు.ఒకవేళ ఎన్‌డిఎ సమావేశంలో దీని గురించి చర్చించవచ్చేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపితో చేతులు కలపాలని జెడిఎస్ యోగిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో కుమారస్వామి నుంచి ఈ రకమైన స్పందన రావడం ఆసక్తికర పరిణామం. గతంలో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలతో జెడిఎస్ పొత్తు పెట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసే జెడిఎస్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం గమనార్హం.
2024 లోక్‌సభ ఎన్నికలలో ఏ కూటమిలో చేరే అవకాశం ఉందన్న ప్రశ్నకు కాంగ్రెస్‌పై విమర్శలను కుమారస్వామి గుప్పించారు. జెడిఎస్ పని అయిపోయిందన్న భావనలో మహాగట్బంధన్(కాంగ్రెస్ కూటమి) నిర్వాహకులు ఉన్నారని, తమను ఆహ్వానించారా లేదా అన్న విషయాన్ని తాను పట్టించుకోబోనని ఆయన చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశానికి ప్రొటోకాల్ కోసం ఐఎఎస్ అధికారులను నియమించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఇటువంటి సమావేశాల కోసం ఐఎఎస్ అధికారులను అధికార పార్టీ నియమించిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశానికి జెడిఎస్‌కు ఆహ్వానం పంపకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఘాటుగా సమాధానమిచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామం జరుగుతున్నపుడు అందులో పాల్గొనడానికి రావాలంటూ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, జవహర్ లాల్ నెహ్రూ ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని వ్యాఖ్యానించారు. దేశం పట్ల, రాజ్యాంగ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం ఆందోళన ఉన్నవాళ్లు ఎవరైనా సమావేశానికి రావచ్చని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News