భూపాలపల్లి : జిల్లాలో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, జిల్లా డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మ్రిశా అన్నారు. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాల నీటి ప్రవాహాంపై మంగళవారం కలెక్టర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహంతో మునిగిపోయే రహదారులను గుర్తించి అటువైపుగా ప్రజలు ప్రయాణం చేయకుండా చూడాలని తెలిపారు.
పొలాల్లో వర్షాల వలన పంట నష్టం కల్గకుండా నీటిని పొలాల నుండి తొలగించేలా రైతులకు, వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ప్రాణ, ఆస్థి, జంతు నష్టాలు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని, కాలువల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు తరలించేలా గేట్లు తెరిచే ముందు సమాచారం అందించి ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్తాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో నివాసయోగ్యం కాని పాత ఇళ్లు, గోడలను తొలగించేలా చూడాలని పేర్కొన్నారు. ఎక్కడ కూడా నీరు నిలిచిపోకుండా నీటిని తొలగించాలని, వర్షాల వలన మురుగుకాలువలలో చెత్త నిండిపోయే అవకాశం ఉన్నందున ప్రతి రోజు కాలువలను శుభ్రం చేసి వ్యాధులు ప్రభలకుండా ఆయిల్ బాల్స్ వేసి తగు చర్యలు చేపట్టాలన్నారు.
అధికారులు అందుబాటులో స్థానికంగా ఉండాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో యువతను, ప్రజా ప్రతినిధుల ద్వారా లోతట్లు ప్రాంతాలను గుర్తించి నీటి ప్రవాహాన్ని బట్టి అక్కడి ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా చూడాలని, మారుమూల గ్రామాలలో డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భిణీలను ముందస్తుగా మండల హెడ్ క్వార్టర్‌కు దగ్గరలో నివాసం ఏర్పాటుచేసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, పోలీస్ అధికారులు, డిపిఓ, డిఏఓ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్‌శాఖ, ఫిషరీస్, ఇరిగేషన్‌శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.