పెద్దపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం ప్రాధాన్యంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో ఆయన పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ముందంజలోఉందని, ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. స్వచ్చత అంశంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించే స్వచ్చ అవార్డుల్లో మన రాష్ట్రం నుంచి సిద్దిపేట, సిరిసిల్లతోపాటు పెద్దపల్లి జిల్లా సైతం గట్టి పోటీనిస్తుందన్నారు. భవిష్యత్‌లో స్వచ్చత అంశంలో మరింత ఉత్సాహంగా పని చేస్తూ జిల్లాను అగ్రస్థానంలో ఉంచేలా కృషి చేయాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలను అనవసరంగా తిప్పించుఉనే అలవాటు వదిలేయాలని, నిబంధనలకు లోబడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే అధికారులు తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.