జమ్మూ : జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సోమవారం రాత్రి భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ మంగళవారంనాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. సూరంకోట్ బెల్ట్‌లోని సింధారా టాప్ ఏరియాలో ఆర్మీ బలగాలు, పోలీసులు సంయుక్తంగా కలిసి నిర్వహించిన ఆపరేషన్ కాల్పులకు దారితీసిందని అధికారులు పేర్కొన్నారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మంగళవారం ఉదయం ఐదు గంటల సమయంలో మళ్లీ కాల్పులు జరిగాయని,ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారని జమ్మూ జోన్ అడిషనల్ డౌరెక్టర్ జనరల్ ఆప్ పోలీస్ (ఎడిజిపి) ముఖేష్ సింగ్ తెలిపారు.
కాగా, ఈ కాల్పులకు సంబంధించి భారత ఆర్మీ ట్వీట్ చేసింది. ‘ఈ ఆపరేషన్ త్రినేత్ర2. ఒక ప్రధాన కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ తహసీల్‌లలోని సిందారా, మైదాన గ్రామాల సమీపంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి భద్రతా దళాలు నాలుగు ఎకె-47 రైఫిళ్లు, పిస్టల్స్, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు’ అని ట్వీట్‌లో పేర్కొంది.