న్యూఢిల్లీ : గోవధ నిషేధించాలని ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇది చట్టపరంగా శాసన సభ నిర్ణయించవలసినదని, అంతేతప్ప ఒక నిర్దిష్టమైన చట్టం తీసుకురావాలని కోర్టు ఒత్తిడి చేయజాలదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు దాఖలైన వ్యాజ్యాన్ని కోర్టు విచారించింది. స్వదేశీ గోసంతతి అంతరించిపోతుందని, దీని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారుని అభ్యర్థనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించవలసి ఉంటుందని సూచించింది.
గోవధను నిషేధిస్తూ సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్న అపీలుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ పాడిపశువుల సంరక్షణ విధానం 2013 ని ప్రస్తావించింది. దీంతోపాటు కొన్ని రాష్ట్రాలు గోవధ నిషేధానికి సంబంధించి చట్టాలను స్వయంగా అమలు చేస్తున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉదహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ 2018 ఆగస్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా అపీలు విచారిస్తున్నప్పుడు తదుపరి ఆదేశాలు అవసరం లేదని జస్టిస్‌లు ఎఎస్ ఒకా, సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం వివరించింది.