హైదరాబాద్: శామీర్‌పేట కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న సినీనటుడు మనోజ్‌ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. శామీర్‌పేటలోని సెలబ్రిటీ రీసార్ట్‌లో ఈ నెల 15వ తేదీన సిద్ధార్థ్ దాస్‌పై ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు మనోజ్‌ను అరెస్టు చేసిన శామీర్‌పేట పోలీసులు కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపించారు.
ఒడిసా రాష్ట్రం, బరంపూర్‌కు చెందిన సిద్ధార్థ్ దాస్‌కు, స్మితకు వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్త మధ్య వివాదాలు ఉండడంతో 2019 నుంచి విడిగా ఉంటున్నారు. స్మిత సిద్ధార్థా దాస్ నుంచి విడిపోయేందుకు కూకట్‌పల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిల్లలను తన వద్దే ఉంచుకుంటోంది. ఈ క్రమంలోనే సినీనటుడు మనోజ్‌తో ఏర్పడిన పరిచయంతో సహజీవనం చేస్తున్నారు. కాగా మనోజ్ పిల్లలపై దాడి చేస్తుండడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వారి తండ్రి సిద్ధార్థ్‌కు సమాచారం ఇవ్వడంతో తన కూతురిని తీసుకుని వెళ్లేందుకు వైజాగ్ నుంచి సెలబ్రిటీ రిసార్ట్ వచ్చాడు.
కూతురి విషయంలో స్మిత, సిద్ధార్థ్ మధ్య వాగ్వాదం జరగడంతో అప్పటికే ఇంట్లో ఉన్న మనోజ్ ఎయిర్ గన్‌తో సిద్ధార్థ్ దాస్‌పై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తప్పించుకన్న బాధితుడు శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మనోజ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. మనోజ్ తమ సహజీవనానికి సిద్ధార్థ్ తరచూ అడ్డువస్తున్నాడని, అతడిని అడ్డుతొలగించుకోవాలని కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని మనోజ్‌ను పోలీసులు కాల్పుల గురించి విచారణ చేయనున్నారు.