కరీంనగర్: మమ్ములను నమ్మి ఓటు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశం ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు
. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా మంగళవారం నగరంలోని 9వ డివిజన్‌లో పర్యటించారు. నగర సుందరీకరణ నేపథ్యంలో కోతిరాంపూర్ చౌరస్తాలో నగర మేయర్ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కమీషనర్ సేవా ఇస్లావత్, స్థానిక కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్, పలువురు పాలక వర్గ సభ్యులతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన నిధులతో పద్మనగర్ చౌరస్తా, కోతిరాంపూర్ చౌరస్తా, సిక్‌వాడీచౌరస్తా, ఐలాంట్ జంక్షన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
దాదాపు 4 కోట్ల రూపాయల నిధులతో నగరంలోని 13నూతన జంక్షన్లను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఓట్లు వేసి నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. తెలంగాణలో 2సార్లు మేయర్‌గా మాకే అవకాశం ఇచ్చారని అలాంటి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
40 నుండి 50 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో కరీంనగర్‌ను మురికి కూపంగా మార్చారు. ఆనాటి నుండి కాంగ్రెస్ హయాంలో పేరుకుపోయిన దరిద్యాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్వయం పాలనలో కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 7 ఐలాండ్‌లను ప్రారంభించామని మరో ఐదు నుండి 6 ఐలాండ్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరానికి పర్యాటక శోభ వస్తుందని తద్వారా కొత్త కంపెనీలు వచ్చి ప్రజల బతుకులు మారుతాయన్నారు.