టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : ఒకవైపు రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీష్ రెడ్డి చెబుతుంటే, మరోవైపు సిఎండి ప్రభాకర్ రావు 24 గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని పేర్కొంటున్నారని, తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా? అని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగదీష్ రెడ్డి నువ్వు మంత్రివా? లేక ఆ శాఖలో బంట్రోతువా? అని ఆయన అన్నారు.
అసలు నువ్వు ఎప్పుడైనా ఉచిత విద్యుత్ పై సమీక్ష చేశావా? ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి నెలా 1వ తేదీన జీతాలు విద్యుత్ ఉద్యోగుల ఖాతాలో పడేవన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి విద్యుత్ శాఖ దిగజారిందన్నారు. సిగ్గుతో తలవంచుకొని జగదీష్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని, రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగదీష్ రెడ్డే అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.