Saturday, November 23, 2024

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్‌చేస్తారని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు నిదర్శనమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం ద్వారక గ్రామంలోని రైతు వేధికలో టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల విధ్యుత్ సరఫరా చాలని చేసిన మాటలకు నిరసనగా మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మూడు పంటలు కావాలా, మూడు గంటల కరెంటు కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు మోటార్‌లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి పంటలు పండక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసి వ్యవసాయం దండగ అనగా ఆ వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ ఇప్పుడు పండగలా చేశాడని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేసి పంటలు పండించుకునే విధంగా ఆదుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడిప్పుడే పచ్చపడుతున్న తెలంగాణాలో చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతన్నలు వ్యవసాయ భావుల వద్దే రాత్రి పగలు అనక పడిగాపులు కాసేవారని, ఆ బాధలను అర్ధం చేసుకొని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కాళేళ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన అన్నారు.

రైతుబంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై చర్చ జరగాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు రాత్రివేళల్లో కరెంటు మోటార్‌లను వేయడానికి వెళ్లి ఎంతో మంది పాము కాటుకు, విద్యుత్ షాక్‌లతో మరణించారని ఆయన అన్నారు.

ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలు, రైతులు అండగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, సర్పంచ్లు మైదం యశోద గంగరెడ్డి, శాంతయ్య, , రైతుబంధు డైరెక్టర్లు అంబడిపల్లి రవిందర్, శంకర్‌రావు, ఇప్ప రమేష్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షులు చుంచు శ్రీనివాస్, నాయకులు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News