హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నట్లు రానున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మి ఎత్తులో కొనసాగుతుండడంతో రాష్టరంలో రానున్న 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఖమ్మం, మహబూబాబాద్, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్.. కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, కలెక్టరేట్, మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశించారు.