అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా మండిపడ్డారు. పవన్ దళపతి కాదని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీలో దళారిగా మారాడని దుయ్యబట్టారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడారు. తల్లి తిట్టిన వాడి కోసం పవన్ దళారిగా మారడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. కాపులు, జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులకు పవన్ క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. సిగ్గులేకుంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామనడం విడ్డూరంగా ఉందని రోజా చురకలంటించారు.
Also Read: వర్షం ముప్పు.. మహారాష్ట్రకు రెట్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి
ప్రధాని మోడీని తిట్టిన చంద్రబాబును ఎన్‌డిఎ సమావేశానికి పిలువలేదన్నారు. కానీ తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ కలిసిపోయారన్నారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక పవన్ మళ్లీ టిడిపి-బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. పవన్ మీడియా ముందు హీరో… రాజకీయాల్లో జీరో అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని పవన్ ప్రగల్భాలు పలికాడని, ఇప్పుడు సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నారని, చంద్రబాబు ఎన్ని లేఖలు పంపినా బిజెపి-ఎన్‌డిఎ సమావేశానికి పిలవలేదని రోజా చురకలంటించారు. చంద్రబాబు ఊసరవెళ్లి అనే సంగతి బిజెపికి బాగా తెలుసునన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానన్న బాబు ఆ పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు.