Monday, December 23, 2024

బేబీ సినిమా నా మనసుకు నచ్చింది: దర్శకుడు సాయి రాజేష్

- Advertisement -
- Advertisement -

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు.   ఈ మూవీ జూలై 14న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోండటంపై మీడియాతో దర్శకుడు సాయి రాజేష్ ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలేంటంటే..

సేలం జిల్లాలో ఓ అమ్మాయి, ఇద్దరబ్బాయిలతో ఉన్న ఫోటోలు వాట్సప్‌లో చక్కర్లు కొట్టాయి. ఆ ఇద్దరబ్బాయిలు కలిసి అమ్మాయి మీద క్రూరంగా దాడి చేసిన ఫోటోలు కనిపించాయి. అసలు ఆ అమ్మాయికి ఏం జరిగి ఉంటుందని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు బేబీ కథ పుట్టింది. కానీ క్లైమాక్స్ అలా ఉంచకూడదని, సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తుందని అనుకున్నాను.

ఆనంద్ దేవరకొండ ఫాదర్ నాకు ఫేస్ బుక్ ఫ్రెండ్. ఆనంద్ టెన్త్ క్లాస్ ఫోటోను అందులో చూశాను.  అలా ఆనంద్‌ను ఫిక్స్ అయ్యాను. అప్పటికి ఇంకా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రాలేదు.  తెలుగమ్మాయే కావాలని హీరోయిన్ విషయంలో ఫిక్స్ అయి ఉన్నాను. ఎక్స్‌ప్రెషన్స్‌తో వెళ్లే సినిమా ఇది. ఇంటర్వెల్ బ్లాక్ విని తెలుగమ్మాయిలు పాత్రని చేయనని చెప్పి వెళ్లిపోతూ వచ్చారు. ఇక వైష్ణవిని ఓ మేనేజర్ ద్వారా కలిశాను. వైష్ణవి, వాళ్ల పేరెంట్స్‌ని ఒప్పించాను.

ఆనంద్ కంటే ముందుగా ఓ ముగ్గురు హీరోలను అనుకున్నాం. ఓ హీరో దగ్గరకు వెళ్లి వద్దని అనుకున్నాను. హృదయ కాలేయం తీసిన డైరెక్టరా? అయితే కథ కూడా వినను అని మరో హీరో అన్నాడు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. అప్పుడే ఈ బేబీ సినిమాను మరింత బాగా తీయాలని అనుకున్నాను. ఆ క్షణమే బేబీ రైటింగ్ మొత్తం మారిపోయింది. సౌండింగ్, రైటింగ్, విజువల్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. మామూలుగా అయితే హృదయ కాలేయం సినిమాను తీయడం, రాయడం చాలా కష్టం. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డాను. నిద్రకూడా పట్టలేదు. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను. కలర్ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. కలర్ ఫోటోకు స్టోరీ ఇచ్చింది నేనే. సినిమాను నిర్మించింది నేనే. కానీ దర్శకుడికి, హీరోకు పేరు ఎక్కువగా వచ్చింది. కానీ నేను ఇలాంటి ప్రేమ కథను తీయగలనా? లేదా? అని జనాల్లో ఆ అనుమానం ఉండేది.

బేబీ సినిమాకు స్క్రిప్ట్ లేదు. రేపు సీన్ అంటే.. ఈరోజు రాసుకునే వాడ్ని. రాత్రి డ్రాఫ్ట్ రాసి టీంకు పంపించేవాడ్ని. ఉదయం వరకు ప్రాపర్టీస్ వచ్చేవి. లొకేషన్లన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో.. తాపీగా సీన్లు తీశాను. దాని వల్ల ఎడిట్ రూంలో ఇబ్బందులు వచ్చాయి.

బేబీ సినిమా నా మనసుకు నచ్చింది. నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారని నమ్మకం ఉంది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందనే భయం కూడా ఉండేది. నిడివి వల్ల విరాజ్, నాగబాబు పాత్రలు మధ్యలోనే లేపేశాను. ఫ్లాప్ అయినా కూడా సంగీతం, కెమెరా, నటీనటులు ఇలా అందరికీ పేరు వస్తుంది. నా కెరీర్ నాశనం అవుతుందని తెలుసు. అయినా కూడా రిస్క్ చేశాను. బెడ్రూంలో సీన్లో అమ్మాయి బాధపడుతుందనేందుకే సింబాలిక్‌గా కంట్లోంచి నీరు వచ్చే షాట్ పెట్టాను. కానీ జనాలకు మాత్రం వేరేలా అర్థమైంది. ఆమె దాన్ని ఆస్వాధించడం లేదు.. గుండెలో బాధతో ఏడుస్తుందని చెప్పడమే నా ఉద్దేశం.

సుకుమార్ గారు నిన్న సినిమాను చూశారు. కాసేపటి క్రితమే ఫోన్ చేశారు. ఫోన్ లోనే ముద్దులు పెట్టేస్తున్నారు. అయితే ఇలా సినిమాలు తీస్తే చూస్తారా? లేదా? అని అనుకునేవాడ్ని.. ఇకపై నా రైటింగ్ స్టైల్ కూడా మారుతుంది అంటూ సుకుమార్ చెబుతుంటే.. ఆయనలాంటి జీనియస్ డైరెక్టర్ ప్రశంసిస్తుంటే.. నాకు మాటలు రాలేదు. బేబీ విషయంలో కొన్ని తప్పులు చేశాను నాకు అర్థం అవుతోంది. అందుకే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి.

నేను సంగీతం, ఆర్ఆర్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటాను. నేను ఆర్ఆర్ కోసం కొన్ని సినిమాలను పది, ఇరవై సార్లు చూశాను. బేబీ విషయంలో నేను ముందుగానే ఆర్ఆర్ చేయించుకోవడంతో సెట్‌లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు అవుట్ పుట్ ఎలా ఉండేదో నాకు తెలిసేది. హృదయ కాలేయం బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లాను. ఇది ఎమోషన్స్‌తో నడిచే సినిమా. పైగా ఇది నాకు జీరో రిస్క్ సినిమా. అప్పటికప్పుడు సీన్ రాసి.. ప్రాపర్టీస్ తీసుకురమ్మంటే తప్పు. చాలా కోట్లు పెట్టి తీసే దర్శకులు ఇలా చేయకూడదు. పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌తోనే వెళ్లాలి.

విజయ్ బుల్గానిన్ ఇది వరకు తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. విజయ్ టాలెంట్ గురించి అందరికీ చెప్పి అవకాశాలివ్వమని అడిగేవాడిని. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. బేబీ సినిమాకు ముందుగా రాజ్ కోటిలను తీసుకుందామని అనుకున్నాను. కానీ విజయ్ బుల్గానిన్ ఎలాంటి ఇగోలకు వెళ్లడు. నేనేం చెప్పినా కాదనడు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ రానుందని నాకు మొదట్లోనే అర్థమైంది.

నేను మంచి ఉద్దేశంతోనే సినిమాను తీశాను. కానీ జనాలు ఎక్కడైతే రియాక్ట్ కాకూడదో అక్కడ రియాక్ట్ అవుతున్నారు. నా సినిమా అప్పలరాజులా మారిపోయింది. తొలిప్రేమకు మరణం లేదు మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అని చెప్పాలని అనుకున్నా.. అందుకే చివరి షాట్ అలా పెట్టాను. హీరో హీరోయిన్లు తొలి ప్రేమను తలుచుకుని బాధపడే షాట్లు పెట్టాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News