Saturday, November 23, 2024

హైదరాబాద్ నగర పరిస్థితులపై మంత్రి కెటిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఎంత భారీ వర్షం కురిసినా, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ప్రాణ నష్టం మాత్రం ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో అధికారులంతా పని చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. నగరంలో గత రెండు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న ముసురుతో పాటు మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ సూచన నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్ష కాలం నేపథ్యంలో వర్షాల కారణంగా నగరవాసులకు ఇబ్బందులు కల్గకుండా తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై నానక్ రామ్ గూడా లోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు మంత్రి కెటిఆర్ కు వివరించారు. ఈ మేరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు లాంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి చేపట్టిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఏడాది పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని మంత్రికి వివరించారు.

పారిశుద్దంపై సుదీర్ఘ సమీక్ష…
నగర పారిశుధ్య నిర్వహణకు సంబంధించి మంత్రి కెటిఆర్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమిక్షించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం మంచి ఫలితాలు ఉన్నాయని, అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కెటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండడం, జనాభా అంతకు అంతా పెరగుతుండడంతో నగరంలో చెత్త సైతం అదే స్థాయిలో ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కి వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News