Monday, December 23, 2024

సేతల్వాద్‌కు సుప్రీంకోర్టు బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త తీస్తా సేతల్వాద్‌కు 2002 గుజరాత్ ఘర్షణలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట దక్కింది. బుధవారం ఈ హక్కుల నేతకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కేసు అంతా అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నెల ఆరంభంలో అప్పటి ఘర్షణల ఉదంతంలో సాక్షులను ఆమె తన వాదనకు అనుకూలంగా మల్చుకున్నారనే కేసులో గుజరాత్ హైకోర్టు స్పందించింది. వెంటనే ఆమె సరెండర్ కావాలని ఆదేశించింది. దీనితో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఎఎస్ బొపనన, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం గుజరాత్ హైకోర్టు తీర్పును నిలిపివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలకు దిగింది. సేతల్వాద్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఛార్జీషీట్ సక్రమంగా లేదని అభిప్రాయపడింది. ఆమె కస్టడీ విచారణ అవసరం లేదనే విషయాన్ని ఇందులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ సంబంధిత కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఈ దశలో సేతల్వాద్‌కు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపిన త్రిసభ్య ధర్మాసనం ఆమె సాక్షులపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్ పలు ప్రశ్నలు సాధించారు. 2022 వరకూ ఏమి చేశారు? ఆమె అరెస్టు దశలో ఎటువంటి ఉద్ధేశాలు ఉన్నాయి? అని నిలదీశారు.

ఆమె రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుపై గుజరాత్ హైకోర్టు తిరస్కరణను తోసిపుచ్చారు. ఆమెపై అభియోగపత్రం దాఖలు చేసిన తరువాత కస్టడీ విచారణలు అవసరం లేదన్నారు. సెషన్‌కోర్టుకు ఆమె పాస్‌పోర్టు అప్పగించారు. ఇది కోర్టు పరిధిలోనే ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అప్పీలెంట్ సాక్షులను బెదిరించరాదు, ఈ విధంగా ఆమె వ్యవహరించినట్లు భావిస్తే గుజరాత్ పోలీసు వర్గాలు నిరభ్యంతరంగా తమ వద్దకు వచ్చి తెలియచేయవచ్చునని ధర్మాసనం తెలిపింది. ఈ స్వేచ్ఛ అక్కడి పోలీసులకు ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కల్పించిన ఊరటతో సేతల్వాద్‌కు దక్కిన రెగ్యులర్ బెయిల్‌తో ఆమె కస్టడీ కుదరదు. అయితే నిందితురాలిగా ఆమె ట్రయల్ దశలో విచారణకు వెళ్లాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News