Friday, November 22, 2024

99 లక్షల మంది పిల్లలకు డీ వార్మింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 99 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 1 -నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ప్రారంభిస్తారు. ఏదేని కారణం వల్ల గురువారం ట్యాబ్లెట్లు తీసుకోలేని విద్యార్థుల కోసం ఈ నెల 27వ తేదీన మరోసారి డీవార్మింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు.

గతేడాది 96.47 లక్షల మందికి ట్యాబ్లెట్లు పంపిణీ చేయగా.. ఈ సారి సుమారు 2.5 లక్షల మంది పెరిగారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కాలేజీల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్కూల్ బయట ఉన్న పిల్లలకు ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ హెల్పర్ల సాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 41,337 మంది టీచర్లకు, 35,700 మంది అంగన్‌వాడీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది.
ఏటా ‘డీ వార్మింగ్ డే’
పిల్లల శరీరాల్లోకి వివిధ మార్గాల ద్వారా నులిపురుగులు చేరతాయి. కలుషిత ప్రాంతాల్లో చెప్పులు లేకుండా నడవడం, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం చేతులు శుభ్రత లేకుండా తినడం, సరిగ్గా ఉడకని మాంసం ద్వారా, పెంపుడు జంతువులు ద్వారా ఇవి శరీరంలోకి చేరుతాయని నిపుణులు చెప్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇవి పొట్టలోకి చేరుతాయి. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, తరుచూ తీవ్రమైన కడుపునొప్పి రావడం వంటి సమస్యలకు దారి తీస్తాయి.

ఈ సమస్యల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఏటా ‘డీ వార్మింగ్ డే’ను నిర్వహిస్తున్నది. తీపి పదార్థాలు తినాలనే కోరిక పెరగడం, తరుచూ కడుపు నొప్పి, ఎక్కువగా ఆకలి కావడం, తలనొప్పి, మట్టి తినడం, తలలో పేలు పెరగడం వంటివన్నీ నులిపురుగులు ఉన్నాయనడానికి సంకేతాలని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి నివారణకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు వేయడం ఉత్తమ మార్గమని, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు పిల్లల వివరాలు

ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులు- 60.56 లక్షలు
ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులు – 34.68 లక్షలు
స్కూల్ బయట ఉన్నవారు – 3.73 లక్షలు

ఏ వయసు వారికి ఎంత డోసు….

1 నుంచి -2 ఏండ్లు: సగం ట్యాబ్లెట్‌ను పొడిగా మార్చి, నీళ్లలో కలిపి ఇస్తారు.
2- నుంచి 3 ఏండ్లు: ఒక ట్యాబ్లెట్‌ను పొడిగా మార్చి, నీళ్లలో కలిపి తాగిస్తారు.
3- నుంచి 19 ఏండ్లు: ట్యాబ్లెట్‌ను చప్పరించాలని సూచిస్తారు.
ఈ ప్రక్రియ మొత్తం టీచర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. ఖాళీ కడుపుతో ఉన్న విద్యార్థులకు ట్యాబ్లెట్ ఇవ్వరు. ఈ ట్యాబ్లెట్ వల్ల దుష్ప్రభావాలు దాదాపు ఉండవు. నులిపురుగులు ఎక్కువగా ఉన్న కొందరు విద్యార్థుల్లో మాత్రం కాస్త నీరసం, వాంతి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News