Monday, December 23, 2024

సమరోత్సాహంతో టీమిండియా

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌కు చావోరేవో, నేటి నుంచి రెండో టెస్టు

పోర్టాఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో గురువారం నుంచి జరిగే రెండో, చివరి టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. డొమినికాలో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య వెస్టిండీస్‌కు రెండో టెస్టు మ్యాచ్ చావోరేవోగా తయారైంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి విండీస్‌కు మరో మార్గం లేదు. అయితే తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విండీస్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తుందా అంటే సందేహమే.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. తొలి టెస్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లు శతకాలతో చెలరేగి పోయారు. యువ ఆటగాడు యశస్వి ఆరంగేట్రం మ్యాచ్‌లోనే కళ్లు చెదిరే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనిపై జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. రోహిత్‌తో కలిసి మరోసారి శుభారంభం అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. విరాట్ కోహ్లి కూడా మొదటి టెస్టులో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

శుభ్‌మన్ గిల్, అజింక్య రహానె, ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్ తదితరులతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అశ్విన్, జడేజా రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. తొలి మ్యాచ్‌లో అశ్విన్ 12 వికెట్లతో చెలరేగి పోయాడు. ఈ మ్యాచ్‌లో కూడా అశ్విన్ జటుక్టు చాలా కీలకంగా తయారయ్యాడు. అతని విజృంభిస్తే విండీస్ బ్యాటర్లు కష్టాలు ఖాయం. డొమినికాతో పోల్చితే ట్రినిడాడ్ పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే భారత బ్యాటర్లు పరుగుల వరద పారించే అవకాశాలున్నాయి.

సవాల్ వంటిదే..
ఇక ఈ మ్యాచ్ ఆతిథ్య విండీస్‌కు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు ఏర్పడింది. అయితే పటిష్టమైన భారత్‌ను ఓడించాలంటే విండీస్ సర్వం ఒడ్డి పోరాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరీబియన్ టీమ్‌కు ఇది శక్తికి మించిన పనిగానే చెప్పాలి. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విండీస్ బ్యాటర్లు తేలిపోయారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగైన ఆటను కనబరచాల్సి ఉంటుంది. లేకుంటే టీమిండియా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం ఖాయం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News