జమ్మికుంట: ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయిన నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు ప్రభుత్వం సాగునీరందస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి భరోసానిచ్చారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపిపి దొడ్డె మమత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఇరిగేష్ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి, ఆశించిన వర్షాలు లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. సాగుకు అవసరమైన నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించాలని సూచించారన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ ఎకరాకు సాగునీరు అందుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అంతకుముందు ఎంపిపి డి.మమతప్రసాద్, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, ఎంపిడీఓ కల్పనలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలుగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.