Saturday, November 23, 2024

‘చంగతి’ మనకూ అవసరం

- Advertisement -
- Advertisement -

‘India’s education system, despite notable progress in recent years, continues to face significant inequalities. These dispari ties are rooted in various factors such as socio-economic status, gender, caste, and geographic location. The consequence s of these inequalities are far-reaching and hinder the country’s efforts towards achieving inclusive and equitable education for all’ Purvaja Yennamaneni

ఏ దేశానికైనా అక్కడి ప్రగతికి, శ్రేయస్సుకు విద్యే మూలస్తంభం. అపార మానవ వనరులు విరాజిల్లుతున్న మన దేశంలో ‘అందరికీ విద్య, అందరికీ అభివృద్ధి’ అనే నినాదాలతో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా గత మూడున్నర దశాబ్దాలుగా సాక్షరతా ఉద్యమం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అయినా మనం సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేకపోయాం. ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం చూస్తే దేశంలో అక్షరాస్యత రేటు 77% మాత్రమే. ఇందు లో పురుషుల అక్షరాస్యత 84.40% కాగా, మహిళల అక్షరాస్యత 71.50%. నైపుణ్య సముపార్జన, జ్ఞాన సముపార్జన, విలువల గ్రహింపు విద్యా లక్ష్యమైనప్పటికీ, చదవడం, రాయడం అనే ప్రక్రి యే ప్రాథమిక దశలో కీలకమైంది. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రెటరీ జనరల్ కోఫి అన్నన్ ‘అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం -1997 సందేశం’లో ఉద్ఘాటించినట్టు ‘కష్టాల నుండి కలలకు ఆశలకు అక్షరాస్యత వారధి. ఆధునిక సమాజంలో అర్థవంతమైన దైనందిన జీవితానికి ప్రకృష్ట సాధనం.

పేదరికాన్ని జయించడానికి ఒక రక్షక కవచం. అభివృద్ధికి ఉదాహరణలుగా చెప్పుకునే రోడ్లు, భవనాలు, ఆనకట్టలు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, పరిశోధన కేంద్రాల నిర్మాణాలకు, సమస్త పెట్టబడులకు అవశ్యపూరకం. ప్రజాస్వామ్యీకరణకు వేదిక, సంస్కృతి పరిరక్షణకు జాతీయతకు గుర్తింపును పెంపొందించే వాహనం విద్య. కుటుంబ ఆరోగ్యానికి, బాలబాలికల పోషకాహారానికి, మహిళల అభ్యున్నతికి ఏజెంట్. ప్రతి ఒక్కరికీ ప్రతి చోటా మానవ హక్కులు వర్థిల్లడానికి, సమాజ పురోగమనానికి ఏకైక మార్గం. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డ తన పూర్తి సామర్థ్యాన్ని గ్రహించగలిగేందుకు విద్యే ప్రబల సాధనం’. అరకొర అక్షరాస్యత్ గల రాష్ట్రాలు దేశాల కంటే, సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు, దేశాలు మానవాభివృద్ధి సూచీలోనూ ఆవిష్కరణల జాబితాలోనూ అగ్రస్థానంలో పోటీపడుతుండటమూమనం చూస్తున్నాం.

ప్రతి ఉద్యమానికి తనవైన ఆశలు (Aspirations), అంచనాలు Expectations), ఆవేశాలు (Exasperations) ఉన్నట్టు సాక్షరతా ఉద్యమానికీ తదనుగుణ ఉద్దేశాలు నిర్దేశించబడినా సంపూర్ణ అక్షరాస్యతకు మనం ఇంకా తగని ఎడంగానే వుండిపోయాం. నూతన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా ‘New India Literacy Programme’ ను ఆమోదించుకుని ‘వయోజన విద్య’ స్థానంలో ‘అందరికీ విద్య’ నినాదాన్ని నిలుపుకున్నా, ఇప్పటికిప్పుడు సంపూర్ణత సాధించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు బలమైన కారణాలూ ఉన్నాయి. అవి, 1. గ్రామీణ పేదరికం అక్కడి పిల్లలను బాల కార్మికులుగా మార్చేయడం, 2. ప్రభుత్వాలు విద్యారంగంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, 3. కొన్ని సార్లు అంతోఇంతో కేటాయింపు జరిగినా క్షేత్ర స్థాయిలో నిధులను సరిగ్గా ఖర్చు చేయకపోవడం, 4. పరిసరాల్లోని పిల్లలందరినీ చేర్చుకునే బాధ్యతలో పాఠశాలకు నిబద్ధత కొరవడటం, 5. పిల్లలకు కావలసిన నాణ్యమైన విద్య పట్ల రాజకీయ పార్టీలకూ సరియైన అవగాహన లేకపోవడం.

ఇక అక్షరాస్యత్ విషయానికొస్తే ఒక వ్యక్తి ఏ భాషలోనైనా అవగాహనతో సరళమైన సందేశాన్ని చదవడం, రాయడాన్ని అక్షరాస్యతగా నిర్వచించింది యునెస్కో. పోతన మహాకవి చెప్పినట్టు ‘చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్’ అనే దృక్పథాన్ని ప్రచారం చేస్తూ నేషనల్ లిటరసీ మిషన్ నేతృత్వంలో 1988లో దేశవ్యాప్తంగా సాక్షరతా ఉద్యమం ప్రారంభమైంది. అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం, గణించడం ఎలాగో నేర్చుకోవడం మాత్రమే కాదు, ప్రజలు తాము వేటిని ఎందుకు ఎక్కడ ఎవరి ద్వారా కోల్పోతున్నారో అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి వుండడం, ప్రగతి వైపు, వికాసం వైపు, అభివృద్ధి వైపు పయనించేందుకు ప్రజలకు చేయూతనివ్వటం అని సాక్షరతా ఉద్యమం ప్రవచించింది.

ఇంకా విడమరచి చెప్పుకోవాల్సివస్తే అక్షరాస్యత ప్రజలకు శక్తిని ప్రసాదించి బానిసత్వం, పేదరికం, వెనుకబాటుతనం, సమస్త అణచివేతల నుండి విముక్తి కల్పిస్తుంది. విద్యా హక్కు చట్టం చెబుతున్న దానికి మించి మానవాళి లోపల సామర్థ్యాలను పెంపొందించి విస్తరించి జీవితాలను అక్షరాస్యత మెరుగుపరుస్తుంది. సాధికారతకు పునాదివేసి సమాజంలో అన్నిచోట్లా, అన్ని స్థాయిల్లో అందరికీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తుంది. సంపదతో పాటు శ్రేయస్సు సుస్థిరతలకు అక్షరాస్యత మార్గం వేస్తుందనేది సాక్షరతా ఉద్యమ సాహిత్య కళారూపాలు ప్రజల్లో రగిలించిన చైతన్యం. అయితే, మధ్యతరగతి, నిరుపేద ప్రజా సమూహాలకు తమ తమ ఆకలి మంటలు, దైనందిన సమస్యల ముందు అక్షర దీప్తి, చైతన్యం గొప్పదైనప్పటికినీ వీగిపోతూనే వుంది.

యునెస్కో- ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1979లో ప్రపంచ జనాభాలో 68% మాత్రమే ఉన్న అక్షరాస్యత ఇప్పుడు 86 శాతంతో పురోగతి సాధించింది. అయినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా కనీసం 763 మిలియన్ల ప్రజలకు ఇప్పటికీ చదవడం, రాయడం రాకపోవడం బాధాకరం. ఈ నిరక్షరాస్యుల్లో మూడింట రెండు వంతుల మంది మహిళలు ఉండటంతో పాటు 250 మిలియన్ల మంది పిల్లలు కావడం, వీళ్లందరిదీ ప్రాథమిక అక్షరాస్యతా నైపుణ్యాలు సైతం లేని దుస్థితి. ఇదిలా ఉంటే, కొవిడ్- 19 మహమ్మారి మూలాన ఏర్పడిన తీవ్ర విఘాతంతో పాఠశాలల్లోని 620 మిలియన్ల బాలబాలికలు, యువకులది కనీస పఠన సామర్థ్యం లేని పరిస్థితి. మన దేశం లో పరిస్థితులు మరీ విచారకరం. ముఖ్యంగా మైగ్రేషన్, రివర్స్ మైగ్రేషన్ లో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలస కుటుంబాల అక్షరాస్యత మరింత ప్రశ్నార్థకంగా మారింది. పిల్లల చదువులు అటు పట్నంలో కొనసాగక ఇటు పల్లెల్లో ఇమడలేని అయోమయస్థితి.

అభ్యసనంలో లక్ష్యసాధన్ మందగించడం, అభ్యసన ప్రాసంగికత కోల్పోవడం, నైపుణ్యాలకు తీవ్ర అంతరాలు ఏర్పడం వెరసి ఉన్నత విద్యలో ఆవిష్కరణల పతనం ఇట్లా విద్యారంగానికి జ్ఞాన రంగానికి చెప్పనలవికాని నష్టం జరిగిపోయింది. ఇదిట్లా ఉంటే, మళ్లీ వలస బాటపట్టిన కార్మికులది ఇంకో వింత పరిస్థితి. తాము పుట్టి పెరిగిన చోట ఉపాధి దొరకక, సరియైన ఉపాధి లేక పనులు దొరకే చోట్లకు వెళ్తున్నారు. వలసలు ఒకప్పుడు ప్రాంతీయంగానే ఉండేవి. ఇప్పుడు దేశంలో వేర్వేరు కారణాల రీత్యా వివిధ రాష్ట్రాలకు ప్రజలు వలస వెళ్తున్నారు. వలస జీవులు ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య భాషా సమస్య. అక్కడి భాష అర్థమై మాట్లాడటం అలవాటయ్యే దాకా భాషే వాళ్లకు ప్రధాన సమస్య. బతుకుదెరువు కోసం వచ్చిన చోట గల భాష రానివాళ్లనే ప్రాంతేతర నిరక్షరాస్యులు ( Non-Native illiterates ) అంటారు.

చూపూ, భాషా రెండూ ఒకటే.భాష రాకున్నా, చూపులేకున్నా ఆ బతుకు కనాకష్టం. ప్రాంతం కాని ప్రాంతంలో, దేశం కాని దేశంలో వలస కార్మికులది భాషరాక ఐదారు నెలల దాకా దీనమయ గాథ, మూగ రోదన. నిత్యావసర వస్తువులను ఏది ఎట్లా తెచ్చుకోవాలో ఎవరి వద్ద తెచ్చుకోవాలో తెలియక, దేనికి ఎట్లా ఎవళ్ల దగ్గర ఎట్లా స్పందించాలో అర్థమవక సతమతమవుతుంటారు. వాళ్లవాళ్ల మాతృభాషల్లో అంతో ఇంతో చదువుకున్నప్పటికినీ నివాసం ప్రవాసం కావడంతో సవాలక్ష తిప్పలు ప్రాంతేతర నిరక్షరాస్యులవి. జాతీయ భద్రతా నిపుణులు, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఆచార్యులు భరత్ కర్నాడ్ ఇటీవల రాసిన గ్రంథం ‘Why India is not a Great Power (Yet)’లో జనాభా సమస్యను చర్చిస్తూ దేశాభివృద్ధికి నిరక్షరాస్యత ఆటంకం ఎట్లాగో ‘Internal Barriers–demographic’ అధ్యాయంలో చెపుతారు.

పెద్ద మొత్తంలోని ఈ నిరక్షరాస్యులకు అదనంగా ఇప్పుడు స్థానికేతర నిరక్షరాస్యుల చేరిక దేశాభివృద్ధికి కొత్త అడ్డంకిగా మారింది. స్థానికేతర నిరక్షరాస్యులు స్థానికులతో కలవకుండా విడిగానూ, ఏకాకిగానూ మిగిలిపోతుంటారు, ఇది ఎవళ్లకీ మంచిది కాదు. ఇది అమానుషం, ఒక రకంగా అసంకల్పిత సామాజిక బహిష్కరణ కూడా. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అదెట్లా? అంటే, ఏ ప్రజలైనా ఈభూగోళం మీద నుంచి ఏ పక్కనుంచి ఏ పక్కకి వచ్చినా ఏ ప్రాంతంలో బతుకుతున్నా వాళ్లకు అక్కడి స్థానిక భాషలో చదవడ రాయడం, నేర్పించడం ద్వారా మొదట బతుకు భయాన్ని పోగొట్టి, ఆ సామాజిక బహిష్కరణ నుండి బయటేయవచ్చు. ఇట్లాంటి ప్రయత్నానికి ఐదేండ్ల క్రితం కేరళ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘చంగతి’ అనే పేరుతో వినూత్నంగా స్థానికేతర నిరక్షరాస్యులకు మళయాళం భాషను నేర్పిస్తుంది.

2018 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేరళ రాష్ట్ర సాక్షరతా మిషన్ అథారిటీ (KSLMA) ’చంగతి’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది మంది వలస కార్మికులు మళయాళీ భాషా ప్రపంచంలోకి ప్రవేశించారు. వలస కూలీలకు నాలుగు నెలల వ్యవధిలో మళయాళంతో పాటు హిందీ చదవడం, రాయడం, నేర్పించడం ఈ కార్యక్రమ ప్రణాళిక. వారానికి ఐదు గంటల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఐదు నుండి పది క్లస్టర్లతో కూడిన అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌లో దాదాపు 15 నుంచి 20 మంది వయోజనులు పాల్గొంటారు. ప్రతి అధ్యయన కేంద్రంలో హిందీ, మలయాళం రెండింటిలోనూ ప్రావీణ్యం కలిగిన బోధకులను నియమించారు. అర్హతలు కలిగిన వలస కార్మికులకోసం అక్షరాస్యత మిషన్ హయ్యర్ సెకండరీ ఈక్వివలెన్సీ కోర్సునూ రూపొందించింది. ఈ అధ్యయన కేంద్రాలను పాఠశాలలు, లైబ్రరీలు, కమ్యూనిటీ హాల్స్, వలస కార్మికుల నివాసాల వద్ద కూడా ఏర్పాటు చేశారు.

‘హమారీ మలయాళం’ పేరుతో వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత, ఆరోగ్యం, సాంకేతిక పరిజ్ఞానం, కార్మికుల హక్కులు, నైతిక విలువల వరకు వివిధ అంశాలతో వ్యవహరించే 25 అధ్యాయాలు వాటిల్లో ఉంటాయి. అధ్యాయాలన్నీ డైలాగ్‌ల ఆకృతిలో ఉంటాయి, బ్యాంకు, స్కూలు, మార్కెట్, పోస్టాఫీసు తదితర నేపథ్యాలతో ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, బిజినెస్ స్కిల్స్ జోడిస్తూ పాఠాల కూర్పు ఉంటుంది . టెకస్ట్‌లోని పదాలను ఖచ్చితమైన, సరళమైన పద్ధతిలో చదవ గల రాయ గల సామర్థ్యం, రాసేటప్పుడు, చదివేటప్పుడు స్పృహతో ఉద్దేశపూర్వకంగా గ్రహణ వ్యూహాలను పాటించ గల సామర్థ్యం పెంపొందే దిశగా ‘హమారీ మళయాళం’ పాఠ్యపుస్తకాలుంటాయి.

కోర్సు పూర్తి అనంతరం మళయాళం భాషా ప్రవేశ పరీక్షను నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తారు. ఎర్నాకులం జిల్లా పెరుంబవూరులో ఈ చంగతి కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిన దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చంగతిని చేపట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షలాదిమంది వలస కార్మికులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతటా రోడ్లు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, భవన నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయం తదితర రంగాల్లో శ్రమలు చేస్తున్నారు. వీళ్లంతా రాష్ర్టేతర వయోజనులే. వీళ్లకు తెలుగు నేర్పాల్సి వుంది. దీనితో సామాజిక వేత్తలు చెబుతున్న సోషల్ ఇంక్లుజన్, భాషా పండితులు కోరుకుంటున్నట్లు తెలుగు అభివృద్ధి ఏకకాలంలో జరిగిపోతాయి. అందుకే చంగతి లాంటి భాషాకార్యక్రమం మనకూ అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News