- మూడు రోజులుగా దంచి కొడుతున్న వానలు
- అలుగు పారుతున్న మహబూబ్‌సాగర్ చెరువు
సంగారెడ్డి: మూడు రోజులుగా సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుండే రాత్రి వరకు సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, కొండాపూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, జోగిపేట, వట్‌పల్లి, జహీరాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో తెకధాటిగా వర్షం దంచి కొడుతోంది. వరద ఉధృతితతో సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చెరువు పొంగి పొర్లుతుండడంతో అలుగు పారుతుంది. సంగారెడ్డి పట్టణంలోని రోడ్లపై కొన్ని ఇళ్ల ముందు నుండే మురికి నీరు పారుతుండడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని పాలు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లపైన వర్షం నీరు వచ్చి చేరుతుండడంతో పలు పట్టణాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జోరు వానలు పడుతుండడంతో రెండు రోజులు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లలోనే ఉండాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం ధాటికి బయటకు వెళ్లలేక చిరు వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండ పోత వర్షంతో వరద నీరు వాగులు, వంకల్లోకి పోటెత్తుతోంది.