Monday, December 23, 2024

ఆగస్టు12వ తేదీన ‘ఆఖరి మోక’

- Advertisement -
- Advertisement -

చలో హైదరాబాద్‌కు అధికసంఖ్యలో హాజరుకావాలి
3లక్షల 30 వేల ఉద్యోగ, ఉపాధ్యాయులు కుటుంబసభ్యులతో తరలిరావాలి
టిఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపు

మనతెలంగాణ/హైదరాబాద్:  సిపిఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగష్టు 12వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన ‘ఆఖరిమోక’ సభకు అధికసంఖ్యలో ఉద్యోగుల కుటుంబసభ్యులు కూడా హాజరుకావాలని టిఎస్‌సిపిఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. టిఎస్ సిపిఎస్‌ఈయూ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ గురువారం మహబూబాబాద్ పట్టణానికి చేరుకోగా సిపిఎస్ ఉద్యోగులు భారీగా తరలివచ్చి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఖ్య నేడు రెండు లక్షలకు చేరిందని, వారంతా ముక్తకంఠంతో సిపిఎస్ రద్దు కోరుతున్నారన్నారు.

గతంలో టిఎస్‌సిపిఎస్సీ ఆధ్వర్యంలో శంఖారావం, జన జాతర, అయుత ధర్మదీక్ష వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. దీనివల్ల సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యూటీ సౌకర్యం, ఫ్యామిలీ పెన్షన్స్ సౌకర్యాన్ని సాధించామన్నారు. వాటిలో భాగంగా నేడు అభి నహితో కబీ నహి అంటూ పెన్షన్ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ను గద్వాల జోగులాంబ అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభించాం ఈనెల 31 వరకు 33 జిల్లాల్లో సందర్శించి యాదాద్రిలో ముగింపు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గతంలో గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసిన సిఎం కెసిఆర్ నేడు ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారన్న ఆశాభావాన్ని స్థితప్రజ్ఞ వ్యక్తం చేశారు.

రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల తర్వాత తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి దక్షిణ భారతంలో ఓపిఎస్ విధానాన్ని అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రిగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే ఆగష్టు 12వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులే కాకుండా ఓపియస్ ఉద్యోగ,ఉపాధ్యాయులు మొత్తం 3లక్షల 30 వేల ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో చలో హైదరాబాద్‌కు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈ.నరేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు పూసపాటి నాగమణి, ప్రధాన కార్యదర్శి గోపు లక్ష్మీకాంత్, రవిచంద్ర,ఆవు నూరి రవి, శ్రీకాంత్ నాయక్,మ్యానపవన్, మల్లికార్జున్, రోషన్, రాజేష్,వెంకటేష్, చంద్రకాంత్, నటరాజ్, హరికోట్ల రవి, వెంకట్ రెడ్డి, శ్రీశైలం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News