Saturday, December 21, 2024

మణిపూర్‌లో మహిళల అర్ధనగ్న ఊరేగింపు..భగ్గుమన్న విపక్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రెండు నెలల కిందట మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఆధారంగా సుప్రీం కోర్టు సుమోటోగా ఈ సంఘటనను పరిగణన లోకి తీసుకోగా, పార్లమెంట్ ఉభయ సభలను కుదిపివేశాయి. ఇది నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశం యావత్తు ఈ ఘటనపై ఆగ్రహంతో ఉందని నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి.

పార్లమెంట్‌లో దీనిపై చర్చించాలి : మోడీకి సోనియా వినతి
మణిపూర్ సంఘటనపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకురాలు సోనియా గాంధీ గురువారం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు గురువారం ప్రధాని మోడీతో కొద్దిసేపు మాట్లాడిన సమయంలో సోనియా ఈ డిమాండ్ చేశారని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు.
ఇది అనాగరిక చర్య : మమతా బెనర్జీ
మణిపూర్‌లో ఇద్దరు సామాన్య మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించే దృశ్యాలు వీడియో చూస్తుంటే భయం గొలుపుతోందని, గుండెపగిలి ఆగ్రహం పెల్లుబుకుతోందని , ఇది తీవ్రమైన అనాగరిక చర్య అని టిఎంసి అధినేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురువారం తీవ్రంగా ఖండించారు. మానవత్వాన్ని మంటకలిపే ఈ చర్యను సమష్టిగా మనమంతా ఖండించాలని ఆమె అన్నారు. బాధ్యులైన దుండగులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం కలిగేలా మనం గట్టిగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ విద్వేష విధానమే దీనికి కారణం : అఖిలేశ్ యాదవ్
మణిపూర్‌లో ఈ పరిస్థితి ఏర్పడడానికి బీజేపీ ఓట్ల రాజకీయం, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేష విధానమే కారణమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. ఇంకా బీజేపీ వైపు మొగ్గు చూపే ముందు సోదరీ మణుల, కుమార్తెల కుటుంబీకులు కచ్చితంగా ఒకసారి ఆలోచించాలని ఆయన కోరారు. మణిపూర్ సంస్కృతి, నాగరికత ఛిద్రమైందని విమర్శించారు.
యావత్తు దేశం ఆందోళన చెందుతోంది : బిఎస్‌పి సుప్రీం మాయావతి
మణిపూర్‌లో హింసా విద్వేషాలు కొనసాగుతుండడంపై యావత్తు దేశం ఆందోళన చెందుతోందని, తాజాగా మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించే సంఘటన ముఖ్యంగా బీజేపీని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని తీరని ఇబ్బందిలోకి నెట్టిందని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఇప్పటికీ శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, ఇంకా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీజేపీ రక్షిస్తుందా అని ప్రశ్నించారు.

మణిపూర్‌ను ప్రధాని మోడీ ఎందుకు సందర్శించ లేదు ? : తేజస్వియాదవ్
మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్‌ను సందర్శించి బాధితులను ఓదార్చగా, ప్రధాని మోడీ ఇంతవరకు ఆ రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించలేదని , ఆర్‌జెడి నేత , బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వియాదవ్ నిలదీశారు. జాతిపరమైన విద్వేషాలతో విచ్ఛిన్నమౌతున్న ఆ రాష్ట్రంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
మణిపూర్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇంకా మండుతోంది : జేడీ(యు) వ్యాఖ్య
మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ గత రెండునెలలుగా మండుకుపోతోందని జేడి(యు) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మణిపూర్ హింస ఇంతలో ఆగేలా సూచనలు కనిపించడం లేదని మరి 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని మోడీకి ఏమైంది ? అని ఎద్దేవా చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం భయంకరం, దిగ్భ్రాంతికరమైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. జేడీ(యు) ప్రధాన అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర వైఫల్యాన్ని తూర్పారబట్టారు.

మణిపూర్ వీడియోపై తక్షణ చర్యలు : ఢిల్లీ మహిళా కమిషన్ డిమాండ్
మణిపూర్‌లో మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించడమే కాక, లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతీ మాలివాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ సంఘటన వెనుక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని, హింసాత్మక సంఘటనలను నివారించాలని కోరారు. మణిపూర్‌ను సందర్శించి బాధిత కుటుంబాలకు పరామర్శిస్తానని, భయంతో ఉన్న ఇతర మహిళలు, బాలికలకు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు. మణిపూర్‌లో గత రెండు నెలలుగా నేరస్తులు విచ్చల విడిగా తిరుగుతున్నారని, అందువల్ల ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. నేరస్తులను తక్షణం శిక్షించి బాధితులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News