కాంగ్రెస్ అద్యక్షుడు ఖర్గేకు రాష్ట్ర బిసి నేతల వినతి
హైదరాబాద్ : జనగణనలో కులగణన, చట్టసభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు రాష్ట్ర బిసి నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బిసి నేతల ప్రతినిధి బృందం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది. బెంగళూరులో 26 పార్టీల నేతలు నిర్వహించిన భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమిలో జనగణనలో కుల గణన చేపట్టాలనే నిర్ణయంపై బిసి నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశ పెట్టడం, బిసిల వివిధ డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలన్నారు. బిసి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసి ల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలని, ఎస్‌సి, ఎస్‌టి, అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్టును తీసుకరావాలని కోరారు. ప్రైవేటు రంగంలో ఎస్‌షి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు కల్పించాలని, సుప్రీమ్ కోర్టు-, హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్‌షి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రియింబర్స్ మెంట్ విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జాతీయ బిసి ఫైనాన్స కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలని, బిసి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. ఖర్గేను కలిసిన వారిలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్, నందగోపాల్, రాజ్ కుమార్, బాషయ్య తదితరులు పాల్గొన్నారు.