Friday, December 20, 2024

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు యువకులు బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమానికి ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే సంజయ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ముఖ్యంగా యువత కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు తీసుకొచ్చారన్నారు.

రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రిఎంబర్స్‌మెంట్ ఇస్తోందని, అలాగే 5 లక్షల మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కల్పించి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం ద్వారా లబ్దిపొందుతున్నారని ఎమ్మెల్యే వివరించారు.

జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 9 గురుకుల పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కృషితో 15 లక్షల మంది యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బిసి కుల వృత్తులను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని, జగిత్యాల నియోజకవర్గంలో ఈ నెలలో 300 మందికి, వచ్చే నెలలో 400 మందికి లక్ష రూపాయల చొప్పున అందిస్తామన్నారు.

ఇల్లు లేని నిరుపేదల కోసం అన్ని రకాల వసతులతో కూడిన 4500 డబుల్ బెడ్ రూంలు నిర్మించడం జరిగిందని, గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు, ఇప్పుడు నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లకు ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలన్నారు. గత పాలకులు జగిత్యాల పట్టణాభివృద్దిని పూర్తిగా విస్మరించారని, దాంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల పట్టణాభివృద్దికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడంతో పాటు అహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కెట్లను అభివృద్ది చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందన్నారు.

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దిని కాంక్షిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు గట్టి బుద్ది చెప్పి బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, కౌన్సిలర్లు పంబాల రామ్‌కుమార్, బొడ్ల జగదీశ్, అడువాల జ్యోతి, కూసరి అనిల్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, వల్లెపు మొగిలి, బాలె శంకర్, అల్లాల ఆనందరావు, ఒల్లెం మల్లేశం, దుమాల రాజ్‌కుమార్, తాజ్, కత్తురోజు గిరి, శ్రీనివాస్, లవంగ రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News