Friday, November 15, 2024

అర్హత కల్గిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: రాష్ట్ర ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం 1అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బిఎల్‌ఓలను సూచించారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో బిఎల్‌ఓలకు, బిఎల్‌ఓల సూపర్‌వైజర్‌లకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు బిఎల్‌ఓ యాప్‌పై నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారికి అవగాహన కల్పించి మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ తరాల పరమేష్ యాదవ్, నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు సట్టు గోపి, శ్రీనివాస్, కుశలవరెడ్డి, శ్రీను లు బిఎల్‌ఓలకు మరియు బిఎల్‌ఓ సూపర్‌వైజర్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిఎల్‌ఓలు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ఇంటింటి సర్వే నిర్వహించి విచారించిన కారణాలు తెలుపుతూ పక్కాగా దరఖాస్తులు పరిష్కరించి ఆన్‌లైన్‌లో అప్‌డేషన్ చేయాలని సూచించారు. పారదర్శకత, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించే విషయంలో బిఎల్‌ఓల పాత్ర కీలకమని తెలిపారు.

ఒకే ఇంటి నెంబర్ పై ఆరు కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే పరిశీలించి, ఓటరు వివరాల సవరణకు, ఓటరు బదిలీకి, దివ్యాంగులుగా నమోదు కోసం, పాత ఫోటో స్థానంలో ఫోటో మార్పు కొరకు, పాత కార్డు స్థానం లో కొత్త ఎపిక్ కార్డు ను తీసుకోవడం కొరకు ఫారం 8 ద్వారా సవరణ, ఓటరు జాబితాలో ఒకే ఓటరు పేరు రెండు సార్లు నమోదు అయినా, చనిపోయిన వారి పేర్ల ను ఫారం 7 ద్వారా తొలగించాలని బిఎల్‌ఓలకు సూచించారు. ఓటరు నమోదు విషయంలో మహిళలు, అనాధలు, ట్రాన్స్‌జెండర్లు, సంచార జాతుల నమోదు పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహశీల్దార్ పి. శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిడిఓ పోరెళ్ల సునిత, ఎంపిఓ ఎండి. అథర్ పర్వేజ్, నాయబ్ తహశీల్దార్ జె. సుకన్య, బిఎల్‌ఓలు, బిఎల్‌ఓల సూపర్‌వైజర్‌లు,  పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News