న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ నికర లాభం 10.9 శాతం పెరిగి రూ.5,945 కోట్లు నమోదు చేసింది. గురువారం కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324) మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.5,360 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.34,470 కోట్లతో పోలిస్తే 10 శాతం పెరిగి రూ.37,933 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ 2023-24కి కంపెనీ తన ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20 నుండి 22 శాతం వరకు కొనసాగింది. కంపెనీ షేరుకు రూ.17.50 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పారిఖ్ మాట్లాడుతూ, తొలి త్రైమాసికంలో 4.2 శాతం వృద్ధిని కనబర్చడం అద్భుతమని అన్నారు. 2.3 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్‌లను పొందడం భవిష్యత్తులో వృద్ధిని బలోపేతం చేయడంలో దోహదం చేస్తుందని అన్నారు.
80 క్లయింట్ ప్రాజెక్ట్‌లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా కంపెనీ విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్లయింట్లు ఆర్థిక సేవలు, తనఖాలు, హైటెక్, రిటైల్, టెలికాం రంగాలలో ఖర్చును తగ్గించడం అని ఆయన వెల్లడించారు. ఒప్పందాలపై సంతకాలు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో కంపెనీ ఆదాయ మార్గదర్శకాలను తగ్గించిందని అన్నారు. ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు ఈ త్రైమాసికంలో తగ్గి 17.2 శాతంగా ఉంది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, మొదటి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌లో 6,940 మంది ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 2023 మార్చి 31 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,43,234గా ఉంది. ఈ సంఖ్య 3,36,294కి తగ్గింది. అయితే గత వారం ఐటి కంపెనీలు టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, ఎల్‌టి మైండ్‌ట్రీ మొదటి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాయి.