Saturday, December 21, 2024

మణిపూర్ ఘటనలపై ఖర్గే ట్వీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిస్థాయి ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.ఈ మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధానిగనుక నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉన్నట్లయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులు రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను పదవినుంచి తొలగించాని ఆయన డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో దీర్ఘకాలిక చర్చ జరిపిన తర్వాత ప్రధాని మోడీ ఉభయ సభల్లోను ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.‘ మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేస్తారని దేశం మొత్తం నేడు ఎదురు చూస్తోంది. 80 రోజులుగా మణిపూర్ మండిపోతున్నా ప్రభుత్వం నోరు విప్పకుండా పూర్తి నిస్సహాయతతో ఉండిపోయింది. ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదు. మోడీ నిజంగానే మణిపూర్ ఘటనపై బాధపడి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై అసత్య ఆరోపణలు మాని బీరేంద్ర సింగ్‌ను డిస్మిస్ చేసి ఉండేవారు’ అని ఖర్గే శుక్రవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు.

రాష్ట్రపతి పాలన అవసరం: చిదంబరం
మరో వైపు మణిపూర్‌లో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర హోంమంత్రి పి చిదంబరం అభిప్రాయపడ్డారు.మైతీలు, కుకీలు హింసను ఆపి పరస్పరం చర్చించకోవడానికి వీలుగా రాష్ట్రంలో కొంతకాలం తటస్థ పాలన అత్యవసరమని ఆయన ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. ‘మణిపూర్‌లో మైతీలు, కుకీలు, నాగాలు అందరూ అంగీకరించిన చట్ట పరిధిలో కలిసి జీవించాల్సి ఉంది. ప్రతి గ్రూపునకు కూడా ఎదుటి గ్రూపుపై ఫిర్యాదులు ఉన్నాయి. ఎవరిది తప్పు, ఎవరిది రైటు అనేది పక్కన పెట్టి మూడు గ్రూపులు కూడా పరస్పరం చర్చించుకొని ఒక సామాజిక, రాజకీయ చట్రంలోకి రావలసిన అవసరం ఉంది’ అని చిదంబరం తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఇది సాధ్యం కావాలంటే కొంతకాలం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరమని తాను ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత సంక్షోభం నుంచి మణిపూర్ బైటపడాలి: నిర్మలా సీతారామన్
మణిపూర్ రాష్ట్రం ప్రస్తుత సంక్షోభంనుంచి బైటపడాల్సిన అవసరం ఎంతయినా ఉందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర ఆర్థికంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గౌహతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన అత్యంత తీవ్రమైన, సున్నితమైన అంశమని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిని తిరిగి నెలకొల్పడానికి మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు.మరోవైపు మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఎంతమాత్రం క్షమార్హం కాదని మిజోరాం రాష్ట్ర మహిళా కమిషన్ పేర్కొంది. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు, మణిపూర్ మహిళా కమిషన్‌కు లేఖలు రాసినట్లు మిజోరాం మహిళా కమిషన్ అధ్యక్షురాలు లల్లాంచుంగి శుక్రవారం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News