హైద్రాబాద్‌లోనే ఉండేవాడిని. కొన్ని రోజులకు కాకినాడకు వెళ్లాను. అక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తుండేవాడిని. నా మ్యూజిక్ అంటే సాయి రాజేష్ గారికి ఇష్టం. నాతో పని చేస్తారా? అని ఓ సారి అడిగారు. ఓకే అన్నాను. కానీ నాతో పని చేయడం కష్టంగా ఉంటుంది.. మీకు ఓకేనా అని సాయి రాజేష్ గారు అడిగారు. పర్లేదు సర్ అని అన్నాను. ఈ కథను కూడా ఆన్ లైన్‌లోనే వినిపించారు. అలా మా జర్నీ మొదలైంది.
కష్టంగా ఉండే పాటలు ముందు చేద్దామని నేను అన్నాను. ప్రేమిస్తున్నా పాటను ముందు కంప్లీట్ చేశాం. ఆ పాట సాయి రాజేష్ గారికి బాగా నచ్చింది. ఆ పాటను రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. మెలోడీ పాటను చేయగలిగితే.. ఏ పాటనైనా కంపోజ్ చేయగలమని నా నమ్మకం. మాస్ పాటలోనైనా మెలోడీ ఉంటేనే ఎక్కువ రోజులు గుర్తుంటుందని నా అభిప్రాయం. నా మ్యూజిక్‌కు అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విజయ్ దేవరకొండ గారు చెప్పిన మాటలు, నాని గారి మెసెజ్ నాకు స్పెషల్. ప్రతీ సినిమాకు నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
సాంగ్స్ కంపోజ్‌కు ఎక్కువ రోజులు పట్టలేదు. ఓ రెండు మేఘాలిలా అనే పాటను కూడా చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ చేశాం. ప్రతీ పాటలో మెలోడీ ఉంటుంది. అందుకే బ్యాక్ గ్రౌండ్‌లో కూడా ఆ పాటల ట్యూన్‌నే వాడాం. సాయి రాజేష్ గారితో పని చేయడం ఇబ్బందిగా అనిపించలేదు. మ్యూజిక్, ఆర్ఆర్ విషయంలో మా ఇద్దరిలో ఎవరు మాట్లాడేదాంట్లో సెన్స్ ఉంటే ఆ టైంకి వాళ్ల మాట వినేవాళ్లం. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూద్దామని అన్నాను. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అరవింద్ లాంటి వాళ్లు కూడా అడుగుతున్నారు (నవ్వుతూ). మీరు నన్ను అడగటం ఏంటి.. నేనే మీ చుట్టూ తిరగాలి కదా? అని అన్నాను (మళ్లీ నవ్వుతూ)
నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు.. మ్యూజిక్ నేర్చుకుంటాను అని ఇంట్లో చెబితే కాస్త భయపడ్డారు. కానీ బాగా ఎంకరేజ్ చేశారు. నాకు సంగీతంలో ఏ ఆర్ రెహ్మాన్, ఇళయరాజా, కీరవాణి గారు స్పూర్తి. నేను ఎవ్వరి దగ్గరా అసిస్టెంట్‌గా పని చేయలేదు. కమెడియన్ సినిమాలకు మ్యూజిక్ చేశావంటూ నా మీద ముద్ర వేశారు.. ఆఫర్లు సరిగ్గా రాలేదు. ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అలా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తుండగా.. సాయి రాజేష్ గారు పిలిచారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట నాకు ఫ్రెండ్. వశిష్టతో సాయి రాజేష్ పరిచయం అయ్యారు. సాయి రాజేష్ గారితో చేసిన బేబీ సినిమాతో బ్రేక్ వచ్చింది.
ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే రెండేళ్లుగా ఏ ప్రాజెక్ట్ కూడా కమిట్ అవ్వలేదు. సాయి రాజేష్, ఎస్ కే ఎన్, ఆనంద్ తరువాత ఈ సినిమా మీద నాకే ఎక్కువ నమ్మకం ఉండేది. ఈ సినిమాకు ఫస్ట్ హీరో నేనే అని డైరెక్టర్ గారు, నిర్మాత, ఆనంద్, వైష్ణవి ఇలా అందరూ అన్నారు. కానీ నేను కాదు. సాయి రాజేష్ గారు అడగకపోతే నేను ఆ మ్యూజిక్ ఇచ్చే వాడ్ని కాదేమో. దీనికి కారణం మాత్రం ఆయనే.
నేను ఇంకా ఏ సినిమాను కమిట్ అవ్వలేదు. స్క్రిప్టులు వింటున్నాను. నాకు నాని గారితో పని చేయాలని ఉంది. ఆయన ప్రొడక్షన్‌లో మీట్ క్యూట్‌కి పని చేశాను. ఆయనకు కూడా నా మ్యూజిక్ అంటే ఇష్టం. బేబీ సినిమాను చూశాక కలుస్తాను అని నాని గారు అన్నారు. సప్తగిరి ఎల్ ఎల్ బి ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను మెచ్చుకున్నారు. ఆయనతో కలిసి పని చేయాలని ఉంది.