మెండోరా : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి పైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులను దాటుకుని ఎస్సారెస్పిలోకి లక్షా 75వేల క్యూసెక్కుల వరద నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు.
వారం రోజులు ఎస్సారెస్పిలోకి భారీగా ఇన్‌ప్లో కొనసాగింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టిఎంసిలు) కాగా శనివారం సాయంత్రానికి 1080.70 అడుగుల (54.387 టిఎంసిలు) నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1 జూన్ నుండి ఇప్పటి వరకు 32.224 టిఎంసిల వరద వచ్చి చేరింది.
ప్రాజెక్ట్ నుంచి అలీసాగర్ 180, ఆవిరి రూపంలో 475 క్యూసెక్కులు వెలుతుందన్నారు. గత సంవత్సరం ఇదే రోజున 1088.30 అడుగులు 77.383 టిఎంసిల నీరు ఉండేది. మాన్ జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల్‌లకు 41 క్యూసెక్కులు, ఆదిలాబాద్, నిర్మల్‌లకు 42 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డిలకు 69 క్యూసెక్కులు మొత్తం కలిపి మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు.
హర్షం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతాంగం : ఎస్సారెస్పి ప్రాజెక్టు నిండు కొనేందుకు చేరువలో ఉన్నందున ఆయకట్టు రైతాంగం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రెండు పంటలకు సరిపడా నీటిని రెండు విడతల వారిగా ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో 9.60 లక్షల ఆయకట్టు విస్తీర్ణం కలిగి ఉంది. ప్రాజెక్టు నిండుకోవడానికి చేరువలో ఉన్నందున పంటలు పండించడానికి వారి మనసులో దైర్యాన్ని నింపుకున్నారు. ఏది ఏమైనా ప్రాజెక్టు ఇలా నిండుకుంటే అటు రైతులకు, పర్యాటకులకు ఎంతో సంతోషంగా ఉంటుంది.