న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) కమాండర్, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ను అనుమతి లేకుండా సుప్రీం కోర్టు లోకి తీసుకురావడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఊహించని ఈ ఘటనకు సుప్రీం ధర్మాసనంతోపాటు అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా షాకయ్యారు. ఈ వ్యవహారంలో జైలు అధికారుల నిర్లక్షంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమం లోనే తీహార్ జైలు ఉన్నతాధికాధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో ఒక డీఎస్పీ, ఇద్దరు ఎఎస్పీలు, ఒక జైలు వార్డెన్ ఉన్నారు. ఉగ్ర నిధుల కేసులో దోషిగా తేలిన యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో జమ్ము లోని ఓ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. దీంతో వ్యక్తిగత హాజరుకు అవకాశమివ్వాలంటూ మే 16 న సుప్రీం కోర్టుకు మాలిక్ లేఖ రాశారు. దీన్ని అందుకున్న సుప్రీం కోర్టు సహాయ రిజిస్ట్రార్… ఇందుకు న్యాయస్థానం అవసరమైన ఉత్తర్వులను జారీ చేస్తుందని ఈ నెల 18 న బదులిచ్చారు.
దీన్ని తప్పుగా అర్ధం చేసుకున్న జైలు అధికారులు, బారీ భద్రత నడుమ మాలిక్‌ను శుక్రవారం సుప్రీం కోర్టుకు తీసుకురావడం గమనార్హం. వ్యక్తిగతంగా మాలిక్‌ను హాజరు కావాలంటూ తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం పేర్కొంది. అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ , జైలు అధికారుల నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నితీవ్ర భద్రతా లోపంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాశారు. ఈ పరిణామాల నడుమ తాజాగా నలుగురు పోలీస్ అధికారులపై వేటు పడింది.